Previous లింగాయతుడు ఎవరు? లింగాయత సిద్ధాంతము Next

విభూతి - రుద్రాక్షి - మంత్రము

✍ పూజ్య శ్రీ మహా జగద్గురు డా|| మాతే మహాదేవి

*

మనము కప్పుకొన్న వస్త్రాదులు ఎండ, చలి, వానలనుండి కాపాడునట్లు - అష్టావరణములు దుశ్చటము, దుర్గుణము, దుష్టకామనలనుండి రక్షించును. పొయ్యిమందలినిప్పు ఆరకున్నట్లు కాపాడుటకు పైన బూడిదను మూయునట్టుగ, అంతరంగ-ఆధ్యాత్మిక తేజస్సు బయట విషయములగాలిచేత ఆరిపోక ఉండవలెనన్న భసితమను దివ్యమైన బూడిదను కప్పవలెను “కామన సుట్టురుహిద భస్మవ నోడయ్యా” అని వీరవిరాగిణి అక్కమహాదేవి చెప్పునట్లుగ అంతరంగ - దుష్టకామనలను కాల్చివేసిన సంకేతమే భస్మము. అది సాత్విక ముఖముద్రను ధరించినవానికి తెచ్చియిచ్చును.

కుదృష్టిని వదలి సమ్యక్ దృష్టిని అలవరించుకొన్నదానికి సంకేతముగ రుద్రాక్షిని ధరింపవలెను. సాధకునియందు దివ్యమైన దృష్టి కలిగి జగత్తునందలి అన్నివస్తువులయందును దైవత్వమును చూడవలెనను ఉద్దేశముతో రుద్రాక్షిని ధరింపవలెను.

విభూతి - రుద్రాక్షులు పూజ్యవస్తువునొదగించు రెండు సాధనములు కాగా, మంత్రము మూడవ సాధనము. మననము చేయుటచేత భవసాగరమును దాటుటకు ఏది సహాయకమగునో అదియే మంత్రము. "ఓం లింగాయ నమ:" అను షడక్షరి మంత్రమునందు కాని “శ్రీ గురుబసవలింగాయ నమః" అను ద్వాదశాక్షర మంత్రమునందుకొని అచలమైన విశ్వాసమును నిలిపి నిత్యము పఠించువాడు లింగాయతుడు. లింగాయత ధర్మముయొక్క ఆదిగురు బసవణ్ణగారు పరంపరాగతముగ వచ్చిన షడక్షరి మంత్రమును పవిత్రమని పఠించినారు. కాని వారు మంత్రపురుషులైనందువలన వారిపేరు మంత్రమైనది బసవ ద్వాదశ మంత్రము లింగాయతునకు పరమశ్రేష్ఠము.

ఇచ్చట. నేనొక సలహాను ఇవ్వగోరుచున్నాను. ప్రార్ధనయందు మూడు విధములు వైయక్తిక ప్రార్థన, సామూహిక ప్రార్థన, రాష్ట్రీయ ప్రార్థనయని. నిత్యలింగార్చన చేయునప్పుడు వైయక్తిక ప్రార్థనకు అవకాశము కలదు. రాష్ట్రీయ సభాసమారంభములందు రాష్ట్రీయ ప్రార్థన జరుగును. కాని లింగాయత సమాజమందు సామూహిక ప్రార్థన వ్యవస్థితమై తప్పని సరియైన విధిగా వాడుకయందులేదు. అనుభవమంటపము ఆధ్యాత్మిక సంస్థయే దానియందు అసంఖ్యాకులు భాగమువహించి చర్చించుచుండినందువలన అచ్చటి భజన (ప్రార్థన)యొక్క పద్దతివుండియుండవచ్చును. ఆ విధముగనే ఇప్పటి లింగాయత సమాజమందు బసవమంటపముల నిర్మాణము కలిగి సామూహిక ప్రార్థనాభజనలు నడచిన మాత్రముననే ఈ ధర్మసమాజములు నిలువగలవు. క్రిశ్చియన్, ఇస్లాం సమాజములు సుసంఘటితముగానుండుటకు ప్రబల కారణము "ఈ సామూహిక ప్రార్థన". ఆ విధమగనే లింగాయతులు తమ వైయక్తిక పూజయందు "ఓం లింగాయ నమ:" అనుషడక్షరి దేవమంత్రమును వాడుకొని వారమునకొకసారి సామూహికముగ ఒక చోటచేరి “ఓం శ్రీ గురుబసవలింగాయ నమ:” అను గురుమంత్రమును భజించుట చాలా శ్రేయస్కరము ఇది గురుమంత్రము, షడక్వరీ దేవమంత్రము.

*

Reference: 1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు Dr. మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
Previous లింగాయతుడు ఎవరు? లింగాయత సిద్ధాంతము Next