కాయకం - తారతమ్య రహితం :
శరణులు ఉదయించే నాటికి బౌద్ధిక వృత్తి శ్రేష్ఠం, దైహిక వృత్తి కనిష్ఠమన్న భావన మరియు వాటిలోనే అనేక తరతమ భేదాలు (ఉచ్చ నీచాలనే భేదాలు) పెరిగిపోయి అవి మానాపమానాల రంగును సంతరించుకొన్నాయి. శరణులు ఈ తారతమ్యాలను హేళనచేసి వృత్తుల్లో సమానతను చాటినారు.
“కాచి కమ్మరి యైనాడు,
ఉతికి మడివాళుడైనాడు,
మగ్గంనేసి సాలె యైనాడు...."
అని దైహిక శ్రమను చెబుతూనే “వేదము చదివి బాపడైనాడు" అంటూ బౌద్ధికమైన శ్రమనూ ఆ వరుసలోనే నిలిపారు. వీటికి క్రియల వ్యత్యాసాలే తప్ప శ్రేష్ఠ కనిష్ఠాలంటూ లేవనే భావం సూచితమైంది. అక్కడితో ఆగక ముందుకు సాగి ఈ రీతి వృత్తి తేడాలవల్ల పెరిగిపోయిన జాతి తారతమ్యాన్ని
సెట్టియందునా సిరియాలుని
మాదిగయననా చెన్నయ్యను
డొక్కలుడందునా కక్కయ్యను
నేను బాపడినంటే కూడల సంగయ్య నవ్వుతాడయ్యా.
అని చెప్పడం ద్వారా నిరాకరించారు. “దేవుని సహితంగా భక్తుడింటికి వస్తే కాయకమేదని ప్రశ్నిస్తే మీ ఆన, భక్తుల కులమెంచితే మీరాణి వాసమాన” అని దిట్టంగా చెప్పడం ద్వారా కాయకాన్ని అంటివున్న కులభేద తారతమ్యాన్ని తుడిచిపెట్టారు.
దైవిక కాయకం :
"లింగాయతనంలో కాయకమనేది కేవలం భౌతిక క్రియ మాత్రమే కాదు. "వెలుపల క్రియ - ఆత్మలో జ్ఞానం ఇట్లే ఉభయాల నెరిగి కలిసి కాయకం చేయాలి. పదునెనిమిది కాయకాలు" అన్న అద్దపు (కన్నడ) కాయకపు అమ్మిదేవుడు జ్ఞానక్రియల సహయోగంలో కాయకం రూపొందాలని చెప్పడంలో అది దైవికమనే గొంతు (ధ్వని) వినిపిస్తుంది. ఈ ధర్మ మార్గంలో గురు-లింగ-జంగమాలు రత్నత్రయాలనిపిస్తాయి. వీటిలో లింగార్చన మనేది, అంగ వ్యక్తిత్వం శుద్ధి గావింపబడి లింగ వ్యక్తిత్వం రూపొందడానికి సహకరిస్తుంది. కాయకంలో తల్లీనతనందడం ద్వారా ఇలాంటి శుద్ధి సాధ్యమైనందువల్ల, ఈ ధర్మంలో లింగపూజ - కాయకాలు రెండూ సమానమని భావింప బడుతోంది. అంతేకాదు, కాయకం ప్రాముఖ్యంగా అన్నాన్ని ఉత్పాదించి ఇస్తుంది కనుక “కాయకంలో నిమగ్నుడైతే లింగపూజనైనా మరచిపోవాలి" అంటూ పూజకంటే కాయకత్వానికే ఎక్కుడు ప్రాధాన్యత నివ్వడం చూడవచ్చు. ఈ విధంగా లింగము (శివుడు) కైలాసంలో ఉన్నట్లుగా కాయకంలోనూ ఉన్న కారణంగా శరణులు
కాయకమే కైలాసం అని చెప్పారు. ఇంతేకాదు కాయకం జంగమ దాసోహ నిర్వహణకు మధ్యమం కావలసివుంది గనుక; అనగా సమాజాన్ని పోషించే అవసరమున్నందువల్ల “కాయకంలో నిరతుడైతే జంగమం ముందున్నా దాని హంగు వదలిపెట్టాలి" అనడంలో కాయక మహత్వం మరింతగా ఎత్తిచూపారు. మొత్తం మీద ఈ ధర్మంలో లింగం, లింగాని కన్నా జంగమం, జంగమాని కన్నా కాయకం శ్రేష్ఠతను కలిగివున్నందున ఇది “కాయక ధర్మం" అనబడింది.