Previous లింగాయతంలొ పంచసూతాకాలు లేవు లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం Next

లింగాయతంలొ మానవ సమానతా

నాయన మా మాల చెన్నయ్య
పెదనాయన మా డొక్కల కక్కయ్య
చిక్కయ్య మా అయ్య కనవయ్య
అన్నయ్య మా కిన్నరి బ్రహ్మయ్య
నన్నెందుకు గురుతించరు కూడల సంగయ్యా? - గురు బసవన్న/14 [1]

ఏ కులమైతే నేమి శివలింగ మున్నవాడే కులజుడు
కులము నెంతురా శరణులందు, జాతి సంకరమైన పిదప
"శివధర్మకులే జాత: పునర్జన్మ వివర్జిత:
ఉమా మాతా పితా రుద్ర ఈశ్వరం కులమేవచ"
అన్నరీతి వారు పెట్టినది స్వకరిస్తాను, కన్యనిస్తాను
కూడల సంగమదేవా నమ్ముతాను మీ శరణులను - గురు బసవన్న/54 [1]

ఇతడెవరివాడు ఇతడెవరివాడు ఇతడెవరివాడు
అని అననీయకయ్యా
ఇతడు మనవాడు ఇతడు మనవాడు ఇతడు మనవాడు
అని అనజేయవయ్యా కూడల సంగమదేవా
మీ ఇంటి బిడ్డనని పించవయ్యా - గురు బసవన్న/64 [1]

నరకువాడే మాదిక మురికి తినువాడే మాల
కులమేదీ? వారల కులమేదీ?
సకల జీవాత్ములకు మేలునె కోరెడు
మా కూడల సంగని శరణులే కులజలు - గురు బసవన్న/175 [1]

జాతిని బట్టి మైల నెన్నుతావు
జ్యోతిని బట్టి చీకటిని వెదుకుతావు
ఇదేలోయ్ పిచ్చి మానవా? జాతిలో ఆధికుడంటావ్
విప్ర శతకోటులుండినా ఫలమేమొయ్
"భక్తుడె శిఖాంణి" అంటుంది వచనం
మా కూడల సంగమదేవుని శరణుల పాదపరుషాన్ని నమ్ము
చెడిపోకు మానవా - గురు బసవన్న/205 [1]

దాసి పుత్రుడుకాని వేశ్యా పుత్రుడుకానీ
శివదీక్ష గొన్న పిదప సాక్షాత్ శివుడని వందించి పూజించి
పాదోదక ప్రసాదాలు స్వికరించుటే ఉచితం
అలాగాక ఔదీశీన్యం పూని తొలగేవారికి
పంచ మహాపాతక నరకం కనుమా
కూడల సంగమదేవా - గురు బసవన్న/224 [1]

దేవా, దేవా విన్నప (మవధారు) మాలించు
విప్రుడు మొదలు అంత్యజుని వరకూ
శివభక్తులైన వారి నెల్లరినీ ఒకటే అంటాను
బాపన మొదలు శ్వపచుని వరకూ
భవియైన వారి నెల్లరినీ, ఒక్కటే నంటాను
ఇట్లని నమ్ముతొంది నా మనసు
ఈ పలికిన పలుకులతో సూదిమొన అంత తేడావున్నా
పళ్ళు కనిపించేలా ముక్కు కోసేయ్ కూడల సంగమదేవా - గురు బసవన్న/229 [1]

దేవ సహితుడై భక్తుడు ఇంటికి వస్తే
కాయక మేదని అడిగితినంటే
మీ ఆన! పురాతనులాన! తలదండం తలదండం
కూడల సంగమదేవా భక్తులందు కులాన్ని ఎంచితే
మీ రాణివాసంపై ఆన. - గురు బసవన్న/233 [1]

నేల ఒకటే మాలవాడకూ శివాలయానికీ,
నీరొకటే శౌచాచమనములకు
కులం ఒక్కటే తన్ను తానెరిగిన వారికి
ఫలమొకటే షడ్దర్శన ముక్తికి
నిలువొకటే కూడల సంగమదేవా నిన్నేరిగిన వానికి! - గురు బసవన్న/263 [1]

సెట్టి అనగలనా? సిరియాళుని
మడివాలుడన గలనా? మాచయ్యను
డొక్కలవాడన గలనా? కక్కయ్యను
మాదిగవాడన గలనా? చెన్నయ్యను
నేను బాపడనంటే కూడల సంగయ్యా నవ్వుతాడయ్యా - గురు బసవన్న/388 [1]

ముట్టు నిలిచికాక పిండం నెలవుకు ఆశ్రయమేదయ్యా
శుక్ల - శోణితముల వ్యవహారం ఒకటే
ఆశ - ఆమిషాలు, రోష హర్షాలు, విషయాదులున్నీ ఒకటే
ఏమి చదివి, ఏమి విని, ఏమి ఫలం?
కులజు డనడానికి ఏమిటి సాక్ష్యం?
"సప్తధాతు సమం పిండం సమయొని సముద్భవం|
ఆత్మజీవసమాయుక్తం వర్ణానాంకిం ప్రయోజనం?||
అనడంవల్ల కాచి కమ్మరియైనాడు! ఉతికి చాకలియైనాడు
మగ్గంపట్టి సాలెయైనాడు! వేదము చదివి పారుడైనాడు
చెవుల్లోంచి పుట్టినవారున్నారా? లోకంలో
అందువల్ల కూడల సంగమదేవా
లింగస్థల మెరిగిన వాడే కులీనుడు - గురు బసవన్న/428 [1]

మాల మాదిగ భక్తుడైతే ఆతనింటి కుక్కను
పంచమహావాద్యాలతో సన్మానించనా?
నెలవు ప్రకటించి ఊఘే ఛాంగు భళాయని
కులమెక్కువ పారుని సిద్ధికి మెచ్చనా?
మీ శరణుల మహిమ గొప్పకే గొప్ప
ఒరే ఒరే కూడల సంగమదేవా మిము నమ్మనివాడే మాల? - గురు బసవన్న/429 [1]

పొలియుంటుందా లింగ మున్నచోట
కులముంటుందా జంగమ మున్నచోట
ఎంగిలుంటుందా ప్రసాద మున్నచోట
అపవిత్రపు మాటలాడే సూతకమే పాతకం
నిష్కళంక నిజైక్య త్రివిధ నిర్ణయం
కూడల సంగమదేవా మీ శరణులకు గాక వల్లకాదు - గురు బసవన్న/431 [1]

మాలమాలయని బయట నుండమంటారు
మాల ఎలాంటి వాడయ్యా
తన మూలతనాన్ని తానెరుగక
ముందటివారి మూలతనం వెదకే
భ్రష్ఠుల నేమందునయ్యా
మహదాని కూడల చెన్న సంగమదేవా -చెన్న బసవన్న/941 [1]

కులజుడినై నేనేమి చేయాలయ్యా?
కులం చెంత దేవుడవుకావు, మనసు కలిగిన దేవుడవే, సరి,
ఏయొనజుడైతేనేం?
నీవను గ్రహించిన వాడే కులజుడయ్యా
కపిల సిద్ధ మల్లికార్జునా - సిద్ధరామేశ్వర/995 [1]

కులమని పోరాడే అన్నలారా వినండోయి
డొక్కలునిది కులమా? మాదిగది కులమా? దుర్వాసునిద కులమా?
వ్యాసునిది కులమా? కులమా వాల్మీకిది? కులమా కౌండిన్యునిది?
కులం చూస్తే గొప్పలేదు
వారి నడత చూస్తే అలా నడిచేవారు ముల్లోకాలలో లేరు కనవొయి
కపిల సిద్ధ మల్లికార్జునా - సిద్ధరామేశ్వర/996 [1]

తినే కంచంలోని కంచు వేరుకాదు
చూచే అద్దం యొక్క కంచు వేరుకాదు
భాండం ఒకటే భాజనం ఒకటే
మెరిస్తే అద్దమనిపించినదయ్యా
తెలుసుకొంటే శరణుడు - మరచిపోతే మానవుడు
మరువక పూజించు కూడల సంగని! /65 [1]

పట్టముకట్టిన పిదప లక్షణాల నెంచడమా?
లింగదేవుని పూజించి కులమడుగుతారా? అయ్యా
కూడల సంగమ దేవుడు
భక్తకాయం మమకాయ మన్నాడు కదా! /267 [1]

కర్మజాతుని తొలగించి గురులింగ పుణ్యజాతుని చేసిన పిదప
శివకులంకాక అన్యకులం శరణుని కున్నదా?
శివధర్మ కులేజాత: పూర్వ జన్మ వివర్జిత:|
ఉమామాతా పితారుద్ర ఈశ్వరం కులమేవచ||
కూడల చెన్నసంగయ్యా
మీ శరణులకు ఎదురులేదు, శివుని కులంకాక -చెన్న్ బసవన్న/738 [1]

బ్రాహ్మణుడు భక్తుడైతేనేమయ్యా? సూతక పాతకాలను విడువడు
క్షత్రియుడు భక్తుడైతేనేమయ్యా? క్రోధం విడువడు
వైశ్యుడు భక్తుడైతేనేమయ్యా? కపటం విడువడు
శూద్రడు భక్తుడైతేనేమయ్యా? స్వజాతిని విడువడు
ఇలాంటి జాతి డంభికులను మెచ్చుకుంటాడా కూడల చెన్న సంగమ దేవుడు -చెన్న్ బసవన్న/848 [1]

వారాలేడు కులాలు పద్దెనిమిదంటారయ్యా
దాన్ని మేము కాదంటాము
రాత్రి ఒక వారం, పగలొక్క వారం
భవి ఒక కులం భక్తుడొక కులం
మాకు తెలిసినది, కనుమా కూడల చెన్నసంగమదేవా -చెన్న్ బసవన్న/900 [1]

ఊరి లోపల బయలు
ఊరి బయట బయలనేవి ఉంటాయా
ఊరి లోపల బ్రాహ్మణ బయలు
ఊరి బయట మాల బయలని ఉంటుందా
ఎక్కడ చూసినా బయలొక్కటే
గోడకు లోనబయట అనే పేరుందా
ఎచట చూచి పిలిచినా ఓ అనేవాడే బిడాడి - బొంతాదేవి/1322 [1]

కులపంతాలు వదిలి మిమ్మల్ని ప్రేమించే భక్తులకు
తలవంచుతాను కులజలుగా ఒప్పి నేను
చక్కగా దరిచేరి మిమ్ము మెప్పించిన శరణులకు
తలవంచని వాడితల శూలానికి చిక్కిన తల కనుమా రామానాథ! /1739 [1]

కులగోత్రాజాతి సూతకాల చేత
చెడినవారు కోటానుకోటి
జనన సూతకంచేత చెడినవారు అనంతకోటి
మాటల సూతకంచేత మొసపొయినవారు
మను మునిస్తొమ అగణిత కోటి
ఆత్మ సూతకంచేత అహంకరించి చెడినవారు
హరిహర బ్రహ్మాదులందరూ
యదృష్టం తన్నష్టం అన్నది గ్రహించక
పదునాలుగు లోకాలు పురాకృత కర్మ మూలంగా
మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉన్నారయ్యా
ఇలా సూతకపు ప్రపంచాన్ని వదలలేని పాషండులైన కుమతులకు
పరబ్రహ్మం ప్రాప్తిస్తుందా అయ్యా?
ఈ కారణంచేత నామరూప క్రియలకు దొరికేవాడు కాదయ్యా
అగమ్య అప్రమాణ అగోచరమయ్యా
బసవప్రియ విశ్వకర్మటానికి కాళికావిమల
రాజేశ్వరలింగం కాక మిగిలినవారికి లేదంటాను. -బాచికాయకం బసవన్న/1846 [1]

వేద శాస్త్రములకు బ్రాహ్మణుడై
వీరవితరణకు క్షత్రియుడై
సర్వము నెంచి చూచుటలో
వైశ్యుడై వ్యాపారానికి లోబడి
కృషి చేయుటకు శూద్రుడై
ఇట్లీ జాతి గోత్రములకు లోనైన నీచ, శ్రేష్ఠములను
రెండు కులములుకాక
అంత్యజులు పదునేనిమిది జాతులన్న కులాలు లేవు
బ్రహ్మను తెలిసినచో బ్రాహ్మణుడు
సర్వజీవహిత కర్మలకు లోబడినప్పుడు చర్మకారుడు
ఈ ఉభయమును తెలిసి మరచిపోలేదు
ఉలి, కత్తి, పాదగూటమునకన్నా క్రిందకావద్దు
నిజాత్మారామ రాముని తెలుసుకో! - మాదార చెన్నయ/1931 [1]

శుక్లం, శోణితం, మజ్జ, మాంసం, ఆకలి, దప్పిక
వ్యసన విషయాదులు ఒకటే భేదం
చేయు కృషి వ్యవసాయం, ఎన్నోకానీ
కానవచ్చే చూపులకు, జ్ఞానాత్మ యొకటే తేడా
ఏ కులమైనా తెలిసినచో పరతత్వ భావి
మరచినచో మలమాయా సంబంధి
ఇట్లీ ఉభయముల తెలిసి మరువలేదు
ఉలి, కత్తి, పాదగొటాలకు క్రింగుగావద్దు
నిజాత్మారామ, రాముని తెలుసుకో! -మాదార చెన్నయ్య/1932 [1]

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous లింగాయతంలొ పంచసూతాకాలు లేవు లింగాయత ధర్మ సంహిత వచనసాహిత్యం Next