Previous హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు వీరశైవ మతము మరియు లింగాయత ధర్మమునుకు గల సంభంధము Next

బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి

*

-డా|| సి.హెచ్. చంద్రయ్య

12వ శతాబ్ధములో బసవేశ్వరులవారు శరణ సంస్కృతిని ప్రవేశ పెట్టిరి. సమానతకు అగ్రస్థానమునిచ్చి మానవీయతకు ప్రాశస్త్యమునిచ్చెడి వినూత్న సంస్కృతియే శరణ సంస్కృతి, కుల, మత రహితముగా మానవాళి తరించుటకు బసవేశ్వరుడు ఆతడి సమకాలీన శరణులు వచనముల ద్వారా ధర్మ సూక్తులను తెలిపిరి. అవి అలవరచుకొనిన ఎవరేని శరణులగుదురు.

సమగ్రమైన సత్వయుతమైన సర్వకాల, సర్వదేశ, సర్వ జనీనమైన సమాధానం రూపొందించినవారు శరణులు, తమ వచనాల ద్వారా సులభ శైలిలో సులభ, గ్రాహ్యాంగా ప్రతి ఒక్కరిని ఎందరో శరణులు ముఖ్యంగా బసవేశ్వరుడు, అల్లమప్రభువు, మడివాళ(చాకలి) మాచిదేవుడు, హడపద (మంగలి) అప్పన్న, అక్కమహాదేవి, అక్కనాగమ్మ, మున్నగువారు వచనాల వెలుగులో ముళ్ళకంచెల్ని తొలిగించి, రాయి రప్ప ఏరివేసి, తగ్గు మిట్టల్ని సమం చేసిన దారి ఎవరికైనా సుగమం, సులభం, శుభప్రదం.

’వ్యక్తిత్వవికాసము లేదా వికసించిన వ్యక్తిత్వం’ అనేది నేడు అధికంగా చెలామణిలోవున్న పలుకు. ముఖ్యంగా, నాగరికంగా ముందున్నామని భావించే పాశ్చాత్యదేశాల నుంచి దిగుమతైన పదజాలం ఇది. బౌతికమైన ఈ వ్యక్తిత్వ వికాసాన్నే భగవంతుడికి వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపే భక్తి భావాన్ని మేళవించి ఆసిద్ధి పొందిన వారిని భక్తులనీ అనుభవంతో పండిన వారిని శరణులనపించుకొన్నారు. అందుకే కోటికోక్క శరణుడు అనేమాట పుట్టింది. అసలు శరణుడంటే ఎవరు? అయన్ని తెలుసుకోనేదెలా? ఎలా మనము శరణులుగా తయారవ్వడం?

అడుగుడుక్కి స్థాన నిధి అడుగుడుక్కి దివ్యక్షేత్రం
అడుగడుక్కి నిధినిధానం చూడవయ్యా
అతని నివాసం వారణాసి, అవిముక్తక్షేత్రం
కూడలసంగని శరణుడు సర్వస్వతంత్రుడు కనుక

బసవన్నగారి శరణ నిర్వచనానికి భాష్యం అక్కరలేదుకదా! శరణుడైనవాడు సర్వస్వతంత్రుడుగా వుండాలి. ఆ స్వాతంత్ర్యం ఎలా సిద్దిస్తుంది. స్వైర విహారంతోకాదు. ఇతరులు అడ్డుపెట్టని వర్తనతో, మనవర్తన ఇతరులను నొప్పించనంతవలకు ఎవరు మాత్రం ఎందుకు అడ్డగిస్తారు? ఆవర్తనలో ఇతరులకూ మేలు కలిగించేది వుంటే అప్పడతడు స్వతంత్రుడే కాదు, ఇష్టుడే అవుతాడు. అటువంటి, వ్యక్తి నివాసమే వారణాసి, అడుగు వేసిన చోటంతా దివ్యక్షేత్రం అడుగడునా సిరిసంపదలు, ఆనందం.

అలాంటి శరణుల్లో స్వరూప-స్వభావలేవటో చూద్దాం, బసవన్నగారి పలుకుల్లోనే.

"ధనంలో శుచి, ప్రాణంలో నిర్భయం!
ఇది ఎవరి కలవడుతుందయ్యా?
నిధివచ్చి వరిస్తే వద్దనే వాళ్ళుండరుగా?
ప్రమాదం ఎదురైతె అబద్దం చెప్పని వాళ్ళుండరుగా?
కానీ, నిరాశ, నిర్భయం కూడల సంగమదేవా
నీవు మెచ్చిన శరణులకు కాక మరి కలుగదయ్యా"

తనది కానిది నిధి వచ్చినా తాకరాదను నిర్మోహత్యం, ఎటువంటి ఆపద లెదరైనా ఎదుర్కొన గలనన్న నిర్భయం అందరికీ సాధ్యం కాదు. ఆశలకీ, ఆమిషాలకీ లొంగుకుండ బయట పడడం అంత సులభం కాదు. అలాగే ప్రమాదం పొంచియుందని తెలిసినప్పుడు, ఒంటరిగా నున్నప్పడూ మనసులోని జంకును జయించి దిట్టతనంగా సవాలొడ్డడం అందరికీ సాధ్యమయ్యేనా? మరి శరణుడంటే ఈ నిర్భయాల సంపన్నుడు. సంతృప్తడు, బసవన్న గారే మరొక్క వచనంలో శరణుల స్వభావాన్ని ఎంత చక్కగా అరటిపండు ఒలచి ఇచ్చినట్లుగా చూపుతున్నారో గమనిద్దాం.

కులమదం పోనంత వరకూ శరణుడవడం ఎలా?
విదివశంతప్పదన్నప్పడు భక్తుడవడం ఎందుకు?
అహమనే సొమ్ము సంబంధాన్ని వదలి
సేవకుడి సేవకుని సేవకుడిగా వుండాలి
తోడు పెట్టిన పాలు నేయి అయనట్లు
కూడల సంగమ దేవా నీ శరణులు

తోడుపెట్టినప్పడే పాలనుండి పెరుగు తయారవుతుంది, పెరుగును చిలికినపుడే అందులోంచి వెన్న వస్తుంది. వెన్నను కాచినపుడే సువాసనతో అన్నిభోజన పదార్థాలకు రుచి కలిగించే నేయి వస్తుంది. అంటే సేవకుడి యొక్క సేవకునకే తాను సేవకుడు కావడం ఎంత మధుర భావన, ఎంత స్థితప్రజ్ఞత ఎంతటి సామ్యవాదప్రభ?

నేను ఉత్తమ వంశసంజాతుణ్ణి, అగ్రకుల మహొన్నతుణ్ణి అనే కులమదంనాటికి నేటికేకాదు కదా ఏనాటికైనా తిరోగమన మనునది సహజ సత్యము. అనేక అనర్థాలకు అది మూలము కూడాను, అది ఒకర్ని ఇంకొకరి నుంచి దూరము వుంచే అడ్డుగోడ. అది ఎంత గట్టి దంటే కళ్ళున్న గుట్టినీ, చెవులున చవిటినీ, కాళ్ళున్న కుంటినీ మనిషి రూపంలోని మృగాన్నీ చేస్తుంది. ఇది యొక జాడైం అయితే, దానకి ఇంకొక జాఢ్యమతోఢు అవుతుమది. అది యేమరి-’అంతా విధివశం’ అనేమాట. ఆభావం మునుష్యుణ్ణి నిరాశావాదిని, నిర్వీర్యుణ్ణి, నిర్వాపారుణ్ణి చేస్తుంది. అదిమరింత దుర్భరస్థితి. అహాన్ని వదలు కోన్నప్పడు ప్రతివ్యక్తీ పాలనుంచి వచ్చిన నేయిలా తయారవుతాడు. మళ్ళీ అతనున్న తావు వారణాసిగా. దివ్యక్షేత్రంగా, చైతన్యానికి ప్రతీకగా మారుతాడు. ఆతని పరిసరాలు ఆనంద పరిమళాలతో గుబాళిస్తవి. వికసించి, వికాసం పొందిన వ్యక్తిత్వమూ శరణ స్వరూపమేకదా!. మరి మనమలా శరణులం కావలంటే ఏమి చేయాలి? మనమొక వ్యక్తిని తోలిసారి పరిచయము చేస్తాము. ఆ మనిషి యొక్క స్వరూపము చూసిన తోడనే మనలో, ఏమి తెలియకుండానే ఏవో ఇష్ట, అయిష్ట, నిర్లిప్త, జుగుప్స, గౌరవం, ద్వేషం లాంటి భావాలు తమకుతామే ఏర్పడతాయి. అంటే వ్యక్తి స్వరూపానిక అంతటి ప్రాధాన్యముందన్న మాట. అందుకే శరణులకు బసవన్న ఒక తీరైన కట్టుబొట్టూ విధించాడు. పన్నెండవ శతాబ్ధమునాటి గౌరవ సూచికాలైన, విభూతి ధారణ, రుద్రాక్షలు, లింగధారణం, లింగధారి విధిగా శుచిగా వుండాలి. తద్వార ఒక శుభ్రత ఆవ్యక్తిలో నెలకొంటుంది. క్రమశిక్షణ అసంకల్పితంగా అలపడుతుంది. చూడగానే ఒక పవిత్ర భావం, దగ్గరినతం, ఆత్మీయతలూ అనిపిస్తాయి. ఒక వ్యక్తిని ఇతరులు ఇష్టపడటానికి ఇంతకంటే ఇంకేమికావాలి? ఇది బసవన్న సూచించిన శరణుని స్వరూప రూపకల్పన.

మరి రూపకల్పనకు ఇంకొకటి అంతేమహాత్యము గల ’సంభాషణ’ సద్గుణమును కూడ తెలియజేసినారు. బసవన్న తన ఒక వచనంలో.

పలికితే ముత్యాల హారంలా వుండాలి,
పలికితే మాణిక్యం వెలుగులా వుండాలి,
పలికితే పారదర్శకపు (స్ఫటికపు) శలాకలా వుండాలి,
పలికితే లింగం మెచ్చి ఔన ఔననాలి, పలికినట్లుగానడవకపొతే
కూడల సంగమదేవుడెలా మెచ్చుకొంటాడయ్యా?

ముత్యాలహారంలో, ముత్యాలు వాటి పరిమాణాన్ని బట్టి ఆకృతిని బట్టి ఒక క్రమంలో కూర్చబడి ఉంటాయి అందులొ విరిగినవీ, వికారమయనవి ఎన్నుకొనము గదా, అలాగే మనం పలికే పలుకులు ఒకే క్రమంలో, స్వరముల పొందికగా వుండాలి. అవి మాణిక్యంలా వెలుగును అంటే సత్యాన్ని ప్రకటించాలి. అంతేకాదు స్ఫటికంలా స్పష్టంగాను స్వచ్ఛంగానూ వుండాలి. సజ్జన సముహానికి మన పలుకులు, అమొద యొగ్యంగా వుండాలి అంతేకాదు నుడివిన నుడువులకూ నడచే నడతకూ ఎడముండరాదు. అంటే మనకు ఖచ్చితంగా సాధ్యమైనదాన్ని స్పష్టంగా మృదువుగా చెప్పాలి అప్పుడే ఎదుటివారు మనకనుకూలంగా స్పందిస్తారు.

కనిపించిన భక్తులకు చేతులు మాడ్చేవాడే భక్తుడు,
మృదువచనములే సకల జపములయ్యా
మృదువచనములే సకల తపములయ్యా
సద్వినయమే సదాశివుని అనురాగమయ్యా
కూడల సంగమదేవుడటుగాని దొల్లడయ్యా

మృదువచన మహాత్త్వాన్ని అంతింతనలేము. అయ్యా అంటే స్వర్గం, ఒరే అంటే నరకం. ఎదుటి వ్యక్తులను ప్రసన్నులను చేసేదిశగా మన పలుకులు ఏవిధంగా ఉండాలొ అంత మధురంగా చెప్పి మనల్నాకట్టుకొంటాడు. అపలుకులు మాత్రమే అయితే వాటి ప్రభావం కొంతమేరకే. అంటే మనము పలికిన పలుకుల్లో ప్రతిభ, ప్రజ్ఞ లేకపోతే అవి కేవలం చిలుక కబుర్లు, ఊకదంపుడు మాటలో అవుతాయి. ఆపలుకులు ప్రజ్ఞనిండి వుండాలి, వాస్తవము ఉండాలి, హేతువుకు నిలబడకలగాలి. ఇక్కడ ప్రజ్ఞకు అర్థం, యోచన ధైర్యం, నిర్మాణాత్మక జ్ఞానం, సర్వజనులకు "లెస్స" అనే హృదయం ప్రతి ఫలించాలి, అదే బసవ వచన మాటల్లో...

ఏదైనా సాదించవచ్చు
మరేదైనా సాధించవచ్చునయ్యా
తానేవరన్నది మాత్రం సాధించలేం
కూడల సంగమదేవుని దయకలిగితే తప్ప

ఆప్రజ్ఞకు ప్రతికల్నిలా అంటాడు బసవన్న.....

పారుతున్న నదిని పొలగలిగితే భక్తి
కూడితే సంతృప్తి నివ్వగలిందే భక్తి
ఇచ్చి మిగిలిన దానిని రక్షంచుకోగలిగితే
వచ్చికలుస్తాడు మా ఖుడలసంగమ దేవుడు

తన్నుతాను తెలుసుకొన్నదే అసలైన జ్ఞానం. ఆజ్ఞానమే వ్యక్తిత్వ వికాసానికి, శరణస్థితికి వేసిన రాచవాట ఆబాటమీదే ప్రతిష్ఠాపన మనే క్రియతో నడిచినపుడే గమ్యం చేరగలం. అంటే క్రియతో కలిసిన జ్ఞానం నిర్మాణడొహదకారి కాగలదన్నమాట, క్రియకు పూనుకొన్నప్పడు ఎదురయ్యే ఆటంకాల నెన్నింటినో అధిగమించాలి బెదరకూడదు. కొంతసాగి తర్వాత నీరు నీరుకారి పొకూడదు. ఫలితం మీద ఆలోచనగాక ప్రయత్నంలో పట్టుండాలి. ఎలా ఉండాలో బసవన్నగారి వచనం మనకు విశదీకరస్తుంది.

వీరుని చేతి ఛరికలా ఉండాలయ్యా
ఎముకలు విరిగేలా సరసమాడినా సహించాలయ్యా
యుద్ధమొలో తలతేగి నేలకూలి
బొబ్బలు పెడితే దాన్ని మెచ్చుకుంటాడు
మా కూడలసంగమదేవుడు

ఓటమి గెలుపులు కాదు ప్రమాణం. లోపము లేని సాధన, ఫలితమెప్పడూ మంచికి మంచే లభిస్తుంది అలా ప్రతిష్ఠాపనము జరిగాక దాని ప్రభావము ఎలా వుంటుంది? మన ప్రపంచములో ఆఖరి విశేషం.

ఎడ తెగని నడత ఎడతెగని పలుకు
ఎడ తెగని సంభాషణా సుఖం
ఎడ తెగని నమ్మిక స్వానుభవ సుఖం
ఎడ తెగని మహిమ, ఎడ తెగని ఆలోచన
కూడల సంగమదేవా నీ శరణునికి.

పరమానంద స్థాయిని అందుకొన్న వ్యక్తి సంపూర్ణంగా ’పరిణతి మతి’ అవుతాడు అక్కడ తాను ముఖ్యంకాదు. తాను ప్రపంచ వ్యాప్తి, జగత్ వ్యాప్తి అవుతాడు. అందరిలో తననూ, తనలో అందరినీ దర్షించుకొనేంత శక్తి సహజంగా సిద్దిస్తుంది. శరణత్వం ప్రాప్తించిన పితప ఎవరైనా ఏమనగలరు? ఆ అనుభవం బసవన్నను ఇలా పలికించింది.

భక్తుణ్ణిని పిలిపించు కుంటానయ్యా మెల్లమెల్లగా
యొగ్యుణ్ణనిపించుకుంటానయ్యా మెల్లమెల్లగా
చాటి శరణుణ్ణని పించుకుంటానయ్యా మెల్లమెల్లగా
ఎగుడు దగుళ్ళను దాటివచ్చి
లింగైక్యుణ్ణనిపించుకొంటనయ్యా
అయ్యా కూడల సంగమదేవా
నీకంటే ఆధికుణ్ణనిపించుకొంటనయ్యా

వచనాలు దైహిక, మానసిక, ఆధ్యాత్మికతకు శరణులు వేసిన రాచబాట. ముళ్ళూ, రాళ్ళూ లేవు, మెత్తని పాలరాళ్ళు పరచిన, నేరుగావున్నబాట, చదివితే, మననము చేసుకొంటే ఎంతో వెలుగు అందులోంచి ప్రసరిస్తుంది, ఆ వెలుగులో ఒక్కసారి మనల్ని మనము చూసుకొనినచో ఆ వచనాలే మనకు ప్రకాశవంతమైన రాచబాట, సోపానబాట అయితుంది. రండి అందరము కలిపి వచన బాటలో నడుద్దాం, ఆచరణతో పరమ సోపానము శరణత్వసిద్ధి పొందుదాం.

Reference:

గ్రంథ ఋణం: బసవ తత్త్వ ప్రకాశిక సావనీరు, ప్రకాశకులు:బసవ ధర్మ కేంద్రము, మహబూబ్‍నగర (పాలమారు), తెలంగాణ.

సూచిక (index)
*
Previous హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు వీరశైవ మతము మరియు లింగాయత ధర్మమునుకు గల సంభంధము Next