జంగమాలలో లింగాన్ని తెలియనివాడు
|
|
- మడపతీ.V. V, జహీరాబాద్.
వీరగణాచారి అంబిగర చౌడయ్య గారి వచనము
|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||
కొబ్బరి కాయను తెచ్చి కుక్క ముందు పడేస్తే
పగులగొట్ట లేదు, తిన లేదు
దానినే పోలుతాడు జంగమాలలో లింగాన్ని తెలియనివాడు
భంగును తిన్నట్టు
తాను కప్పుకున్నది లేనిది, తనకు తెలియనప్పుడు
కొబ్బరి తినడం తెలియని కుక్కలాగ అన్నాడు అంబిగ చౌడయ్య. - సమగ్ర వచన సంపుటం: 6 వచనము సంఖ్య : 174
నాడు విచ్చలవిడిగా కొనసాగుతున్న వేశాధారుల అరాచకాలను రూపుమాపడానికి తనను తాను తెలుసుకోవడానికై, చక్కని ఉదాహరణతో పై వచనములో గణాచారి అంబిగర చౌడయ్య గారు చెప్పడం జరిగింది.
కొబ్బరి కాయను తెచ్చి కుక్క ముందు పడేస్తే పగులగొట్ట లేదు, తిన లేదు
కొబ్బరి కాయ (నారికేళము) - పరమపవిత్రమునకు, స్వచ్ఛతకు సంకేతము.శునకము - చంచలత్వము, తనలో అదృఢత్వానికి అసహనానికి ప్రతీక. అటువంటి శునకము ముందు నారికేళమును పెట్టిన పైనున్న గుజ్జునే నములుతుంది గానీ, దానిని పగులగొట్టదు దాని లోపలి కొబ్బరిని తిని, అందులోని తీపిని గానీ రుచిని గాని ఆస్వాదించాలని అది తెలుసుకోదు. ఏవిధంగానైతే నారికేళములోని కొబ్బరి రుచిని శునకము ఎప్పటికీ తెలుసుకోదో..! అదే విధంగా, ఇతరులను మాయా మాటలు చెప్పి, తాను సన్యాసి అయిననూ సంసారులకంటే అష్టఐశ్వర్యాలు అనుభవిస్తున్న వేశాధారి జంగముడు చూడడానికి ఇష్టలింగమును ధరించినప్పటికీ, దాని మర్మాన్ని ఎన్నడూ గ్రహించలేడు.
ఎవరైనా సరే ఇష్టలింగాన్ని ధరించిన పిదప దాని పవిత్రతను, దానిపై నిష్టను, ఏకదేవోపాసనా నిష్టతో, లింగాంగసామరస్యం ద్వారా తనకు తాను తెలుసుకోలేక పోతే నారికేళములోని కొబ్బరిని తినని కుక్కవలే జీవితం మారుతుందని, నాడు కల్యాణ రాజ్యములో పడవను నడిపే నావికుడు, ఇష్టలింగం యొక్క మర్మాన్ని అందరికి తెలిసే విధంగా అంబిగర చౌడయ్య గారు పై వచనములో చెప్పడం జరిగింది.
బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి
అందరికీ అనంత శరణు శరణార్థులు.
*