Previous పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు గురువువల్లనే బ్రతికి యున్నాను Next

మణులు లెక్కించి కాలమును గడపకు

- మడపతీ.V. V, జహీరాబాద్.

అల్లమ ప్రభుదేవుని వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

"మణులు లెక్కించి కాలమును గడపకు.
గవ్వలను పూజించి దినమును గడపకు.
క్షణమైనా కానీ నిజమైన స్మరణ చాలు.
మంటలో ఉన్న గుణము వేడి నీటిలో ఉండునా గుహేశ్వరా!" - సమగ్ర వచన సంపుటం : 2 వచనము సంఖ్య : 1435

వచనానుభావము: పై వచనములో అల్లమ ప్రభుదేవుడు లింగవంతులు ఉండే విధానము గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది.

మణులు లెక్కించి కాలమును గడపకు.

మణులు అంటే మాలలు ఎంచుకుంటూ నేను పదివేల జపాలు చేశాను. నేను లక్షా పదహారు వేల జపాలను చేశాను. నేను తొంబై ఆరు లక్షల జపాలు చేశాను అని మణులను లెక్కించుకుంటూ జపములను చేయువాడు లింగవంతుడు కాదు. లింగవంతుడు ప్రతీ క్షణమూ దేవుని స్మరణలోనే ఉండాలి.

గవ్వలను పూజించి దినమును గడపకు.

గవ్వలను పూజించి అంటే కాలాన్ని విభజించి రాహుకాలమని , గుళిక కాలమని , సూమూర్తమని , దుర్ముహూర్తమని , దశమి , ఏకాదశి , వంటివే శ్రేష్టమని మిగితా సమయము పనికి రాదనే భావనలో లింగవంతుడు ఉండరాదు. లింగవంతునికి ప్రతీ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు పరమ పవిత్రమే ఆయన ఎల్లప్పుడూ దైవీ స్మరణలోనే ఉంటాడు.

క్షణమైనా కాని నిజమైన స్మరణ చాలు.

కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా దేవున్ని అరకొర భక్తితో స్మరించడం కంటే మనస్సును కేంద్రీకరించి మనసా వాచా కర్మణా మంచిగోరి ఒక్క క్షణమైనా సరే నిజమైన భక్తియే ముఖ్యము.

మంటలో ఉన్న గుణము వేడి నీటిలో ఉండునా గుహేశ్వరా !.

ఇక్కడ అల్లమాప్రభుదేవుడు ఒక అద్భుతమైన ఉపమేయాన్ని చెప్పడం జరిగింది. అదేమిటంటే, ప్రతీరోజు ప్రతీసమయం చాలా అధ్భుతమైనదని భావించే వారు మంటలాంటి వారు. వేడినీటివారలైన మంచి రోజులు, మంచి నక్షత్రాలు, మంచి సమయము, ఆచారాలు, సుమూర్తము, వంటివి ఆచరించే వారు వేడి నీటితో సమానం అందుకే, మంటకు ఉన్నటువంటి వేడిమి లక్షణం వేడి నీటిలో ఉంటుందా గుహేశ్వరా అని సరళమైన వచనములో చెప్పడం జరిగింది.

శరణు శరణార్థి. 🙏

వచన సాహిత్యమును అందరూ చదవాలి, తెలుసుకోవాలి

*
సూచిక (index)
Previous పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు గురువువల్లనే బ్రతికి యున్నాను Next