Previous *శరణుల ముఖ్య నియమాలు ఏమిటి ?* రేపు మాపు మరొక్కనాడు అనబోకురా Next

చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై?

- మడపతీ.V. V, జహీరాబాద్.

చెవి 🦻 నుండి పుట్టినవారు ఉన్నారా భూమిపై అని ప్రశ్నించే...

లింగాయత ధర్మగురు బసవేశ్వరుని వచనము

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమః ||

మైలగాక పిండమునకు ఆశ్రయమే లేదు ;
జలబిందువుల వ్యవహారము మొక్కటే !
ఆశ అభిలాష హర్ష రోష విషయాదు లన్నియూ ఒక్కటే !
ఏమి చదివినా , ఏమి వినినా , ఏమి ఫలము ?
కులజుడనుటకు ప్రమాణమేది ?
"సప్తధాతు సమం పిండం, సమయోని సముధ్భవం
ఆత్మజీవ సమాయుక్తం వర్ణానాం కింప్రయోజనం ?"
కాచి కమ్మరియయ్యే ;
ఉతికి చాకలియయ్యే ;
చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ?
కూడలసంగమదేవా !
లింగస్థల మెఱిగిన వాడే కులజుడయ్యా ! " సమగ్ర వచన సంపుటం : 1 వచనము సంఖ్య : 590

వచనానుభావము:ఎవ్వరూ ఆకాశం నుండి కానీ, పాతాళం నుండి కాని, చెట్టు చేమల నుండి కాని రాళ్ళు రప్పల నుండి కాని పుట్టరని అందరూ తల్లి గర్భమునుండే పుట్టాల్సి వస్తుందని, అలా కాకుండా ఎవరైనా చెవినుడి పుట్టిన వారుంటారా అని బసవణ్ణగారు తన వచనములో ప్రశ్నించడం జరిగింది.

మైలగాక పిండమునకు ఆశ్రయమే లేదు ;
జలబిందువుల వ్యవహారము మొక్కటే !
ఆశ అభిలాష హర్ష రోష విషయాదు లన్నియూ ఒక్కటే !

మైల కాకుండా ఈ లోకములో ఎవ్వరూ పుట్టడం అసాధ్యమైన విషయం. జలబిందువుల వ్యవహారం ఉంటే మాత్రమే స్త్రీలు గర్భం దాల్చడం సాధ్యం. ఆశ, ఆకాంక్ష, కోరిక, హర్షం, రోషం విషయాదులన్నియు అందరికి సమానం.

ఏమి చదివినా , ఏమి వినినా , ఏమి ఫలము ?
కులజుడనుటకు ప్రమాణమేది ?
"సప్తధాతు సమం పిండం, సమయోని సముధ్భవం ఆత్మజీవ సమాయుక్తం వర్ణానాం కింప్రయోజనం ?"

జలబిందు వ్యవహారం తెలియక పోయినప్పుడు , ఏమి చదివినా ? ఎన్ని చదివినా ? ఏమి విన్నా ? ఎన్ని విన్నా ? ఇటువంటి వారు జ్ఞానులు అనడానికి ఏమైనా ప్రమాణం ఉందా ? సప్త ధాతువులతో ఏర్పడిన ఈ దేహం ఇందులో ఉండే దైవత్వం అందరికీ సమానమే అలాంటప్పుడు వర్ణవ్యవస్థ తో ప్రయోజనం లేదు.

కాచి కమ్మరియయ్యే ;
ఉతికి చాకలియయ్యే ;
చెవినుండి పుట్టినవారు కలరే భూమిపై ?
కూడలసంగమదేవా ! లింగస్థల మెఱిగిన వాడే కులజుడయ్యా

ఇనుమును, ఇత్తడిని, లోహాలను కాచి దానిని ఆకృతి ఇచ్చే కాయకం చేసేవాడు కమ్మరియైనాడు. ఇంటింటికి వెళ్ళి బట్టలను శుభ్రపరిచే కాయకం చేసేవాడు చాకలి అయినాడు. అంతే కాని పుట్టుకతో ఎవ్వరూ శూద్రులు కారు. అందరూ తల్లి గర్భమునుండి పుడుతారే తప్ప చెవి నుండి పుట్టినవారు ఉన్నారా ఈ లోకములో ? అని ప్రశ్నించడం జరిగింది. ఎన్ని చదువులు చదివినా ఎన్ని గాథలు విన్నా లింగస్థలమును అంటే, లింగాంగ సామరస్యమును పొందిన వాడే నిజ శరణుడని మహా మానవతావాది ధర్మగురు బసవణ్ణ గారు పై వచనములో చెప్పడం జరిగింది.

బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి

🙏 శరణు శరణార్థి 🙏

*
సూచిక (index)
Previous *శరణుల ముఖ్య నియమాలు ఏమిటి ?* రేపు మాపు మరొక్కనాడు అనబోకురా Next