పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు
|
|
-మడపతీ.V. V, జహీరాబాద్.
పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు, ధర్మగురు బసవేశ్వరుని వచనము
లింగాయత ధర్మములో అందరికీ సర్వసమానమైన ప్రాతిపదికను బసవణ్ణగారు ఇవ్వడం జరిగింది. అంటే సేవకుడు, విద్వాంసులు, పండితుడు, బ్రహ్మజ్ఞానులు, మహాపురుషులు, అందరూ తనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకొనే అత్యున్నతమైన పరదపదవియైన ఐక్యస్థలమునకు చేరుకోవడం జరిగింది. అంతే కాని పుట్టుకతో ఎవ్వరూ శ్రేష్ఠులు కారు అనే విషయాన్ని బసవేశ్వరుని క్రింది వచనములో గమనించవచ్చును.
మైలగాకుండా పిండము నకు ఆశ్రయం లేదు ,
జలబిందువుల వ్యవహార మొక్కటే !
ఆశ, అభిలాష హర్షరోష
విషయాదు లన్నియూనొక్కటే,
ఏమిచదివినా , ఏమి విన్నా ఏమిఫలము ?
కులజుడనుటకు ప్రమాణమేది ?
సప్తధాతు సమం పిండం , సమయోని సముధ్భవం
ఆత్మజీవ సమాయుక్తం వర్ణానాం కింప్రయోజనం ?
కాచి కమ్మరియయ్యే , ఉతికి చాకలి యయ్యె ,
చెవినుండి పుట్టినవారు ఉంటారా భువిలో ?
కూడలసంగమదేవా !
లింగస్థలమెఱిగినవాడే కులజుడయ్యా ? - గురు బసవణ్ణ
మహిళలకు మాసిక ప్రకృతి ధర్మమైన ముట్టు వ్యవస్థ లేనిదే మాంసపిండానికి ఆధారమే లేదు. అంతెందుకు సకలమానవులకు జంతు జీవాలకు పుట్టుటకు కారణమైన జలబిందువులెన్నున్న తండ్రి వీర్యము యొక్క చలనక్రియలో అందరిలో ఒకే విధంగా తన తల్లి గర్భాశయంలో వ్యవహారము జరుగుతుంది. అటువంటి మానవునిలో అందరికీ సమానమైన ఆశ ఆమిశము రోషము సంతోషమూ వంటివి సర్వసమానంగానే ఉండి పంచేంద్రియాలతో ఉండే విషయసుఖాలు మొదలైనవి సకలమానవులలో ఒకే రకంగా ఉంటాయి. అయినప్పుడూ అందరూ సమానమే అనే భావనను మఱిచిపోయి వేద, ఆగమ, శాస్త్ర, పురాణాలు, ఎన్ని చదివి ఎన్ని విన్నప్పటికీ ఏమి ప్రయోజనము ? తల్లిగర్భమునందు పుట్టిన మానవునిలో శ్రేష్ఠులని కనిష్టులుగా ఉన్నారనడానికి ఏమిటి సాక్ష్యము ? అందరి దేహము పిండము, రసము, రుధీరము, మాంసము, మేధస్సు, అస్తికలు, మరియూ శుక్లములనబడే సప్త ధాతులతో ఏర్పడినదే కాదా..? ఈ దేహములో చైతన్యస్వరూపమైన ఆత్మ తత్వము అందరిలో ఒకే రకంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మానవునిలో బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే తారతమ్యాలు మరియూ అధికుడు అల్ఫుడను వర్ణ వ్యవస్థ లాంటి తారతమ్యాలెందులకు ? వాటివల్ల ప్రయోజనం ఏమిటి ? అనేది జ్ఞానసూక్తి మాత్రమే తెలియజేస్తుంది..! వారి వారి కాయకవృత్తిని అనుసరించి, ఇనుమును కాచి పనిముట్లుగా కాయకం చేసేవాడు కమ్మరి అయ్యెను, బట్టలు ఉతికే కాయకం చేసేవాడు చాకలి ఆయెను. బట్టలు నేసే కాయకం చెయ్యడంతో సాలెవాడయ్యెను. వేదమును చదివి బ్రాహ్మణుడాయెను. ఇవన్నియూ తన కాయకము ద్వారా వచ్చినవే. అయితే దీనిని అనుసరించి జాతి, వర్ణ, కులములతో ఆధారము కల్పించి మేలు కీడని తారతమ్యము చెయ్యరాదు. మేలు వర్ణము వాడు అధికడు అనుటకు ఎవరైనా చెవినుండి పుట్టినవారు ఉంటారా..?? అందరూ నవ మాసాలు మోసి తల్లి గర్భము నుండే రావాలి కదా !! లేరు, లేనే లేరు ఈ కారణము చేత జగత్తులో గల సకలచరాచర జీవులందరూ ఉధ్భవించడానికి ఈ జగత్తనే లింగమునుండే మనమందరము పుట్టామని తెలుసుక్కవాడే నిజమైన తత్వజ్ఞాని అతడే కులజుడు అని బసవణ్ణ గారు పై వచనములో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక వచనములో..
వ్యాసుడు బోయత కొడుకు ;
మార్కండేయుడు మంగలి సుతుడు ;
మండోదరి కప్ప కూతురు ;
కులము నెంచకుడో ;
కురమున మున్నేమైనదయ్యా ?
సాక్షాదగస్తుడు కబ్బిల ;
దూర్వాసుడు ముచ్చెగ ;
కశ్యపుడు కమ్మరి ;
కౌండిన్యుడను ఋషి మంగలి ;
సంగని వచనము చాటుచుండె శ్వపచుడైనా నేమి?
శివభక్తుడే కులజుడని.
శరణు శరణార్థి..
*