Back to Top
Previous ఇష్టలింగము బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి Next

హిందుమతము నుండి ఆవిర్భవించిన మతములు - ధర్మములు

- కొండా బసవరాజు

హిందూ మతము సమ్మిశ్రితము, నిజానికది మహొన్నత సంస్కృతి, ఉత్తరాదిన హిమాలయాలు మొదలుకొని దక్షిణాన రామేశ్వరమును తాకెడి హిందూ మహాసముద్రము వరకు, తూర్పున బంగాళా ఖాతము తీరము నుండి పశ్చిమాన అరేబియా సముద్రతీరమువరకు సింధూనది సముద్రమున కలియు భూభాగమంతా నివసించెడి జనులు వేర్వేరు భాషలు మాట్లాడేవారైనా ఒకే సంస్కృతికి అలవాటు పడినారు. అదే శివుని ఆరాధించెడి మరియు విష్ణువు నారాధించెడి, దుర్గామాత ఇతర దేవతల నారాధించెడి మరియు గణపతి నారాధించెడి అలవాటులు కలగియున్నారు వీరశైవులని, వైష్ణవులని, శాక్తేయులని, గాణాపత్యులని పిలువబడిరి. ఇవే మతములైనవి, శైవ మతపు శాఖగా వీరశైవము వర్ధిల్లగా, వైష్ణవము నుండి వీరవైష్ణవము వెలసినివి. ఇవన్ని ఆకార దేవుళ్ళనుకొలిచే మతములు. ఏదేవుళ్ళను ఆరాధించని నాస్తికమతములే జైన, బౌద్ధమతములు కాగా నిరాకార సృష్టికర్త పరమాత్ముని మాత్రమే ఆరాధించునవి లింగాయత ధర్మములు, ఏకులము మతము వారలైనా జైన, బౌద్ధ, లింగాయత సిఖ్ఖు ధర్మియులుగా పరివర్తన నొందవచ్చును. స్వతంత్ర ధర్మములుగా వెలుగొందు ఈ ధర్మములు హిందు సంస్కృతి నుండి ఆర్భవించినవి. ఈ ధర్మీయులకు ప్రత్యేక ధర్మగ్రంథము, ధర్మక్షేత్రము, ధర్మగురువు గలరు.

జైనధర్మము:

ఇది క్రీస్తుపూర్వము 5వ శతాబ్ధములో ఆవిర్భవించినది, జైన ధర్మపు మొదటి తీర్థంకరుడు (ధర్మగురువు) ఋషభదేవుడు. 24వ (చివరి) తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు, క్రీపూ. 599లో వైశాలి నగరమున జన్మించారు, తన 72వ ఏట పరమపదించారు. జైనధర్మపు గ్రంథము ఆచారాంగ సూత్ర, సూత్రకృతాంగ, భగవతీ సూత్ర మొదలగు పదునొకండు (11) అంగములు.

బౌద్ధధర్మము:

ఇది క్రీస్తు పూర్వము 6వ శతాబ్ధములో ఆవిర్భవించినది. ఈ ధర్మస్థాపకుడు సిద్ధార్థుడు (గౌతమ బుద్ధుడు) క్రీ. పూ. 563 ప్రాంతమున కపిలవస్తు నగరమున జన్మించారు. తన 35-36వ ఏట జ్ఞానోదయమై బుద్ధుడాయెను. 44 ఏండ్లు ధర్మ ప్రబొధము చేసి తన 70వ ఏట నిర్యాణము చెందారు. బుద్ధుడు ఐదుగురు (బిక్షువులకు) పరివ్రాజకులకు మొదటి సారిగా సారనాథ్‍లో ధర్మోపదేశముచేసిరి. ఈ ఐదుగురే బౌద్ధ ధర్మమును ప్రపంచము నందంతటా వ్యాప్తినొందించిరి. బౌద్ధ ధర్మగ్రంథము త్రిపీఠికలు.

లింగాయత ధర్మము:

ఇది క్రీస్తు శకము 12వ శతాబ్ధములో ఆవిర్భవించినది. ఈ ధర్మమును "శరణ" ధర్మమని "బసవ" ధర్మమనియూ అందురు, ఈ ధర్మ స్థాపకడు బసవేశ్వరుడు క్రీ.శ. 1134లో వైశాఖ శుద్ధ అక్షయతదియ రోజున రోహిణి నక్షత్రమందు కర్నాటకలోని ఇంగుళేశ్వర సమీప బాగెవాడిలో జన్మించారు. తల్లిదండ్రులు మాదలాంబ-మాదరస అను శైవబ్రాహ్మణ దంపతులు. తన 21వ ఏట జ్ఞానోదయమై సృష్టికర్తాగు నిరాకార పరమాత్ముని తప్ప అన్యదేవో, దేవతారాధన తగదని తెలుపుటే గాక పరమాత్ముడు విశ్వమందంతటా వ్యాపించయున్నాడు కావున విశ్వదాకార చిరురూప ఇష్టలింగమును పూజించెడి విధానమును ఆదీకులమతాల కతీతముగా స్త్రీ-పురుష వివక్షతలేక అందరు పూజించితరించుటను అమలునకు తెచ్చిరి. క్రీ.శ. 1160నుండి 1196 వరకు 36 సంవత్సరములు ఈ నూతన ధర్మమును వ్యాప్తినొందించి తన 62వ ఏట క్రీ.శ. 1196నందు నళనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి రోజున సమాధిస్థితిలో పరమాత్ముని సన్నిధి చేరిరి. లింగవంత (బసవ)ధర్మపు ధర్మగ్రంథము బసవేశ్వరుడు అతడి సమకాలీన శరణ-శరణిలు అనుభవమతో పలికిన ’వచన సంహిత’ అనబడే వచన సాహిత్యము. ఈ ధర్మియుల ధర్మక్షేత్రము బసవేశ్వరుల వారు ఐక్యమొందిన కృష్ణా-మలప్రభా నదుల సంగమస్థానము కూడలసంగమము.

సిఖ్ఖు ధర్మము:

ఇది 15వ శతాబ్ధములో ఆవిర్భవించినది. ఈ ధర్మ స్థాపకుడు గురునానక్ క్రీ.పూ. 1469లో ఎప్రిల్ 15వ తేదిన పంజాబ్‍లోని తలవాడి గ్రామంలో క్షత్రియకుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు తృప్తాళు-మెహతాకాలు అను దంపతులు. విదేశ తురుష్కుల పాలనలో మ్రగ్గుచున్న జనాన్ని వీరోచితులుగా, ఒకే దేవుని పూజించేవారుగా, ఆత్మాభిమానముగలవారిగా తీర్చిదిద్దారు. అన్ని కులముల వారిని సిఖ్ఖులుగా మారుటకవకాశము కల్పించారు. తన 70 ఎళ్ళ ప్రాయంలో తేది 22-09-1530లో తనువును చాలించి పరమాత్ముని సన్నిధికి చేరారు. సిఖ్ఖు ధర్మపు ధర్మగ్రంథము ’గురు గ్రంథసాహిబ్’ ఈ ధర్మీయుల ధర్మక్షేత్రము అమృతసర్ నందలి "స్వర్ణదేవాలయము".

భారత దేశము నందు ఆర్భవించిన జైన, లింగాయత, సిఖ్ఖుధర్మములు మరియు విదేశియ ధర్మములగు క్రైస్తవ, మహ్మదీయ ధర్మములు సకల మానవాళినుద్ధరించు ధర్మములు, వీటిలో ఏ ధర్మీయడుగానైనా పరివర్తన నొంది ఆధర్మాచరణలు నిష్ఠతో పాటించెడిచో జీవినమును సార్థకము చేసకొనిన వారగుదురు.

నుడిచినటుల నడమట, పరులకు సహాయ పడుట, సత్యశుద్ధ కాయకముతో, స్వఅర్జిత సంపాదనను తన కుటుంబమునకేగాక పరుల హితమునకు దాసోహమొనరించుట, ఎల్లరనూ నతవారుగా భావించుట, పరస్త్రీలపై వ్యామోహము కలిగియుండని, స్త్రీలేనచో పరపురుషనిపై వ్యామోహముయుండని ధర్మాచరణలు కలిగియుండవలేనని అన్ని ధర్మములూ తెలుపుచున్నవి.

Reference:

గ్రంథ ఋణం: బసవ తత్త్వ ప్రకాశిక సావనీరు, ప్రకాశకులు:బసవ ధర్మ కేంద్రము, మహబూబ్‍నగర (పాలమారు), తెలంగాణ.

సూచిక (index)
*
Previous ఇష్టలింగము బసవ వచన ఆచరణతో శరణత్వ సిద్ధి Next