Previous లింగాయతలు లింగవంతలు అటునిటు పరుగులు పెట్టనట్లు Next

లింగాయత ధర్మపు పోరాటం

*

లింగాయత ధర్మపు అడుగు జాడల్లో మనం ఎందుకు పోరాటం చెయ్యాలనుకుంటున్నాము?

|| ఓం శ్రీ గురు బసవ లింగాయనమ ||

బసవాది శరణులు స్థాపించిన లింగాయత ధర్మము నకు దక్షిణ భారతదేశంలో సుమారుగా 900 సంవత్సరాల ఇతిహాసమే కలదు. ఆనాడు విశ్వగురు బసవేశ్వరుడు ఏర్పరిచిన లింగాయత ధర్మము నందు దేశము మరియు ప్రపంచము యొక్క నలుమూలముల నుండి వచ్చినటువంటి శరణుల నాయకత్వములో, జాతి కులము వర్గ వర్ణ లింగ బేధం లేకుండా అందరూ సమానంగా స్వతంత్రంగా జీవించే హక్కును సంపాదించారు. అపుడు ఏర్పడిన లింగాయత ధర్మములో నాటి అంటురానివాళ్ళు, శూదృలు, చెప్పులను కుట్టే వారు, బట్టలను నేసేవారు, నాయి బ్రాహ్మణులు, బట్టలు ఉతికేవారు, పడవలను నడపేవారు, కుండలను చేసేవారు, డప్పులను వాయించేవారు, వేషాలువేసుకొనే వేషధారులు, గుర్రాలను మేపేవారు, కంసాలివారు, చీపురు ఊడిచేవారు, కట్టెలను కొట్టేవారు, వైద్యం చేసేవారు, వేశ్యావాటికా వేశ్యలు, జైనులు, దిగంబరులు, నాథ పరంపరవాళ్ళు, చివరికి ఆనాటి బ్రహ్మణులు కూడా, ఇలా ఎందరో, ఎన్నో జాతులవారు బసవేశ్వరుడు ప్రసాదించిన ఇష్టలింగాన్ని ధరించి ఏకదేవోపాసకులై అనందరూ సమానమే అన్న భావనను ప్రచారము చేసారు. ఆ విధముగా ఏర్పడిన ధర్మమే లింగాయత ధర్మము. చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా మహిళలకు పురుషులతో సర్వసమాన హోదాను కల్పించిన ధర్మమే లింగాయత ధర్మము. మహిళలను సూతకమని , తక్కువ జాతి వారిని అస్పృస్యులనీ కించపరిచి వేధించే ఆనాటి సమాజంలో, ఆనాటి చదువురాని మహిళలకు, చీపురు ఊడిచేవారికీ, చివరికి వేశ్యలకు సైతం విద్యాభ్యాసం నేర్పించి వారిచే తమ తమ అనుభవ జ్ఞానమైన వచనాలను రాసే విధముగా చేసిన భారత దేశపు ప్రప్రథమ ధర్మమే లింగాయత ధర్మము.

14 వ శతాబ్దములో అనిబిసెంట్ నిర్మించిన పార్లమెంట్ కంటే 200 ల సంవత్సరాల పూర్వమే కల్యాణ నగరములో, బసవేశ్వరుడు అనుభవమంటపం అనే పార్లమెంట్ను ఏర్పాటు చేసి అందులో 770 అమరగణాలను చేర్చుకొనుట జరిగింది. ఇందులో 500 పైగా వచనకారులు, 220 మంది మహిళ గణములు సుమారు 33 మంది మహిళా వచనకార్తీయులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఘనచరిత్ర లింగాయత ధర్మానికే చెందును.

ఈ విధమైన సాహిత్యము , సాంప్రదాయము, సర్వసమానత్వ భావన కలిగిన ధర్మానికి అఖిల భారత వీరశైవ మహా సభవారు "వీరశైవ లింగాయత ధర్మము" అనే నినాదముతో మూడు సార్లు సరైన ఆధారాలను సేకరించకుండానే , కేంద్రానికి వినతిపత్రం పెడితే కేంద్రం దీనిని తిరస్కరించిన విషయం విదితమే. కాని ఇప్పుడు అన్ని ఆధారాలతో సంసిధ్ధులమై యున్నా కూడా వీరు "లింగాయత ధర్మానికై" మనకు సహకరించకపోవడం విడ్డూరముగా ఉన్నది.

లింగాన్ని ధరించినవారందరూ లింగాయతులే అన్న నినాదంతో పోరాటం చేస్తే... 1963 వ సంవత్సరంలో సిక్కులకు , 1993 లో బౌద్ధులకు మరియూ 2014 లో జైనులకు ఏవిధంగా రాజ్యాంగపరమైన స్వతంత్ర ధర్మంగా ప్రకటించి వాటికంటే మూల ధనము నుండే అనేక నిధులు మంజూరు చేసి వారి సాహిత్యము పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలకు ప్రత్యేక ధనాన్ని కేటాయించి, వారి ధర్మములోని యువకులకు ప్రత్యేక రియాయతి సదుపాయాలు. ప్రతీ సంవత్సరం బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా, అన్ని విషయాలలోను ఆ ధర్మాలకు సమానంగా ఉన్న లింగాయత ధర్మానికి కూడా స్వతంత్ర మాన్యత సంపాదించేందుకై మనందరమూ కలిసికట్టుగా కృషి చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుందని ప్రతీ లింగాయతులు అందరూ తెలుసుకోవాలి.

లింగాయతులకు బసవణ్ణయే ధర్మగురువు, వచన సాహిత్యమే ధర్మగ్రంధము, కాయక సిద్దాంతమే ధర్మసిధ్ధాంతమని మన పూర్వీకులైన బసవాది శరణులు తమ తమ వచనాలలో చెప్పడం జరిగింది.
ఉదా: అన్నీ ధర్మాల సంస్కృతి సంప్రదాయాల కంటే లింగాయత ధర్మ సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉన్నాయని మనము ధర్మగ్రంధమైన వచన సాహిత్యము ద్వారా గమనించవచ్చు తెలుసుకోవచ్చును.

1) తమ గురువు ద్వారా ప్రసాదించిన ఇష్టలింగమే లింగాయతులకు సర్వము సర్వస్వము, లింగాయతులు ఏకదేవోపాసకులు - ఇష్టలింగము వదిలి అన్యదైవారాధన చెయ్యనివారు. ఎందుకంటే లింగాయతులు లింగైక్యం చెందితే వారి వెంట వచ్చేది ఇష్టలింగము మాత్రమే అని వారికి తెలుసు

2) లింగాయతులందరూ ఏ ధర్మములో లేనటువంటి అష్టావరణ (గురువు, లింగము, జంగమము, పాదోదకము , ప్రసాదము , విభూతి, రుద్రాక్ష, మంత్రము) అంగముగా మార్చుకొన్న సంపన్నులు. పంచాచారాలే ( లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, మరియూ బృత్యాచారము) ప్రాణమై, మరియూ షట్ స్థలములే ( భక్త, మహేష, ప్రసాది, ప్రాణలింగి, శరణ మరియీ ఐక్య) ఆత్మతత్వముగా ఉన్నవాడే లింగాయతుడు.

3) లింగాయతులు లింగైక్యము చెందితే వారి పార్థివ శరీరముతో పాటు తాము ప్రాణప్రదంగా ఆరాధించిన ఇష్టలింగాన్ని చేతిలో పెట్టి ఖననం చెసే సంస్కృతి ఉన్నది. ఏధర్మములోనూ ఇలాంటి సంస్ర్కుతి కనపడదు.

4) పంచసూతకాలైన జననసూతకము, మరణ సూతకము, జాతి సూతకము, ఉచ్చిష్టసూతకము, రజస్సూతకములను ఆచరించక, పునర్జన్మ సిద్ధాంతాన్ని, చతుర్వర్ణ వ్యవస్థ దేవ నిర్మితం కాదని, మానవ నిర్మితమనే జ్ఞానాన్ని తెలుసుకొని అందరూ సమానులే అన్న నినాదం చేసే ధర్మమే లింగాయత ధర్మము.

ఇలాంటి మహత్తరమైన లింగాయత ధర్మసాధనకై కృషిచెయ్యడానికి , ధర్మరక్షణకై మనకంటూ ఒక స్వతంత్ర హోదాను పొందడానికి, లింగాయతులైన మనందరము కృషి చేయుటను అదృష్టముగా భావించడంలో సందేహమేలేదు.

అందరికీ అనంత శరణూ శరణార్థులు.

మడపతి.వి.వి.
లింగాయత సమన్వయ సమితి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం

*
Previous లింగాయతలు లింగవంతలు అటునిటు పరుగులు పెట్టనట్లు Next