Previous కలవారు శివాలయం కట్టించారు ఆచార భ్రష్టుని గురించి Next

లింగాయత దేవుడు ఎలా ఉన్నాడు

*

-మడపతీ.V. V, జహీరాబాద్.

సత్యక్క గారి వచనములో వైజ్ఞానిక సత్యం

బసవాది శరణి, 12 వ శతాబ్దంలో కల్యాణము నందు వీధుల్లో చీపురు ఊడిచే సత్యక్క గారి వచనములో వైజ్ఞానిక సత్యం

"తలపై తల ఉంటుందా ?
నుదిటిపైన కన్నులు ఉంటాయా ?
కంఠములో విషము ఉండునా ?
దేవుడనేవారలకు ఎనిమిది రకాల దేహములు ఉంటాయా ?
తండ్రి లేని వారుంటారా ?
తల్లి లేని వారుంటారా ?
ఓ పిచ్చివాడా, నీకు జ్ఞానోదయం కాదా ! శంభుజక్కేశ్వరుడు కాక అన్య దైవములుండునా ?" సమగ్ర వచన సంపుటం : 5 వచనము సంఖ్య : 1219

వచనానుభావము :

బసవణ్ణ గారి కంటే పూర్వం మహిళలకు వాక్ స్వాతంత్రం గానీ, చదివే హక్కు గాని, రాసే జ్ఞానము గాని, ఆధ్యాత్మిక చింతనతో గాని లేకుండా అంటురానివారిగా సమాజానికి దూరంగా పెట్టడం బసవణ్ణ గారికి దృష్టిలో తప్పుగా అనిపించింది. అందుకే అదే సంకల్పంతో నాడు తాను ఏర్పరచిన అనుభవమంటపములో సుమారు 60 మందికి పైగ మహిళా శరణులు అందులో సుమారు 30 మంది వచనకారులను తయ్యరు చేసిన అతిపెద్ద మహా విశ్వవిద్యాలయ సంస్థ అనుభవమంటపము. ఏమీ చదువురాని వారలకు కూడా జ్ఞానమును పంచి పెంచి వారిచేత వచనాలను రాసేవిధంగా చేసినవారు బసవణ్ణ గారు. అందులో భాగంగా, పై వచనము 12 వ శతాబ్దంలో కల్యాణము నందు వీధుల్లో చీపురు ఊడిచే కాయకం చేసే సత్యక్క గారి వచనములో వైజ్ఞానికంగా పంచకర్మేద్రియాలు, పంచజ్ఞానేంద్రియాల ప్రాముఖ్యతను చాలా సున్నితంగా ఎంత పెద్ద విషయాన్ని సత్యక్క చెప్పారో ఆలోచించగలరు.

తలపై తల ఉంటుందా ?

తలలో మెదడు, కళ్ళు, ముక్కు, నోరు, చెవుల వంటి సున్నితమైన భాగాలు కపాలంలో భద్రంచేయబడ్డాయి. అందరికీ కనిపించే మన ముఖం అదే నుదిటి భాగం దీని మొత్తాన్ని తల అని పిలుస్తాము. వైజ్ఞానికంగా, మానవుడు జీవించాలంటే ఒక్కటే తల ఉండాలి. ఒక్కటే మెదడు ఉండాలి. అలాంటప్పుడు, తలపైన ఇంకో తల ఉండడం సాధ్యమేనా అనే ప్రశ్నను సత్యక్క ఇక్కడ వెయ్యడం జరిగింది.

నుదిటిపైన కన్నులు ఉంటాయా ?

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అని అంటారు. కనుగుడ్డు, కార్నియా, కటకం, నల్లగుడ్డు, ఐరిస్, నేత్రోదక ద్రవం, కనుపాప, సిలియారి కండరాలు కంటిలోని ముఖ్య భాగాలు అన్నీ కలిస్తేనే కన్నులు చూడడానికి పనికి వస్తాయి. మానవునికి కన్నులు అనేవి చాలా ముఖ్యం అవి లేకపోతే లోకమే చీకటిగా ఉంటుంది. అటువంటి కండ్లు మానవునికి నుదిటి కింది భాగానా మాత్రమే ఉండగలవు. కాని నుదిటిపై ఉండగలవా అని వైజ్ఞానికంగా ప్రశ్నించడం జరిగింది.

కంఠములో విషము ఉండునా ?

గొంతుక లేదా కంఠము ముక్కు, నోరులకు వెనుక భాగంలో స్వరపేటిక, అన్నవాహిక లకు పైనున్న భాగం. ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థలకు రెండింటికి చెందినది. ఆహారం అన్నవాహికలోనికి, గాలి ఊపిరితిత్తులలోనికి
జీవి బ్రతకడానికి భోజనం ఎంతో అవసరం. మానవుడు ఏమైనా భోజనం చెయ్యాలంటే నోరు దానినుండి కంఠమే ముఖ్యద్వారము. ఒక వేళ ఆ కంఠమే మనకు విషాన్ని విదజిమ్ముతుంటే మనము ఏవిధంగా బ్రతకగలము. ఏ ప్రాణికైనా కంఠములో విషము ఉంటే బ్రతకడం సాధ్యమేనా అనే వైజ్ఞానికి విషయాన్ని చెప్పడం జరిగింది.

దేవుడనేవారలకు ఎనిమిది రకాల దేహములు ఉంటాయా ?

ఈ సృష్టిని నిర్మించిన పరమేశ్వరుడు ఒక్కడే అని తెలుసుకున్నాక, సృష్టి స్థితి లయ కారకుడు ఒక్కడే అయిన తరువాత ఆయన మరలా మరలా జన్మించి ఎనిమిది రకరకాల దేహముతో పుట్టడం సాధ్యమేనా ! నిజమైన దైవత్వానికి అన్ని జన్మలు ఉంటాయా ? అని అడగడం జరిగింది.

తండ్రి లేని వారుంటారా ?

వైజ్ఞానికంగా, ఈ ప్రపంచములో ప్రతీ ప్రాణి పుట్టడానికి కారణం తండ్రి యొక్క వీర్యకణాలే. అలాంటి తండ్రి లేకుండా ఎవరైనా పుట్టడం సాధ్యమేనా అని సత్యక్క తన వచనములో ప్రశ్నించడం జరిగింది.

తల్లి లేని వారుంటారా ?

తల్లి లేనిదే జీవమూ లేదు జీవితమే లేదు. నవమాసాలు మోసి తాను పురిటినొప్పులతో మరుజన్మనెత్తి బిడ్డకు ప్రాణం పోసే తల్లి ఎటువంటి ప్రణులలోనైనా సమానమే. అన్నీ ప్రాణులు పక్షులు జంతుజాలం తల్లి లేకుండా పుట్టడం అసాధ్యం. అలాంటి తల్లి లేనివారు ఎవరైనా ఉండడం సాధ్యమా అని సత్యక్క తన వచనములో ప్రశ్నించడం జరిగింది.

ఓ పిచ్చివాడా, నీకు జ్ఞానోదయం కాదా !

ఓ పిచ్చివాడా ! సృష్టికి కర్త, కర్మ, క్రియయైన పరమేశ్వరుడు అక్కడా ఇక్కడా ఎక్కడో ఉన్నాడని కలత చెందకు, నీలోనే దాగివున్నాడనే సత్యాన్ని తెలుసుకో. ఓ పిచ్చి మానవుడా నీలోనే దైవము పరమేశ్వరుడు దాగి ఉన్నాడనే జ్ఞానోదయం ఎందుకు కలగడం లేదు ! అని తన ఆవేదనను సత్యక్క వ్యక్తం చేస్తుంది.

శంభుజక్కేశ్వరుడు కాక అన్య దైవములుండునా ?

శంభుజక్కేశ్వరుడు అంటే ఎక్కడో ఉన్న దైవము కాదు. సత్యక్క తన వచనము యొక్క మకుటంగా తాను ఆరాధించే ఇష్టలింగాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇష్టలింగ నిష్టతో తనను తాను లింగాంగ సామరస్యము ద్వార తెలుసుకోగలిగితే తనలోనే శంభుజక్కేశ్వరుడు కొలువై ఉన్నాడు అనే వైజ్ఞానికంగా విషయాన్ని సత్యక్క తన వచనములో చెప్పడం జరిగింది.

"బసవాది శరణుల వచనాలు అందరూ చదవాలి అందరికీ చదివించాలి"
అందరికీ అనంత శరణూ శరణార్థులు.

*
సూచిక (index)
Previous కలవారు శివాలయం కట్టించారు ఆచార భ్రష్టుని గురించి Next