ఊరిలోనికి క్రొత్త వాళ్ళు వస్తే
|
|
*
-మడపతీ.V. V, జహీరాబాద్.
ధర్మగురు బసవేశ్వరుని వచనము
ఊళ్ళోకి కొత్త వాళ్ళొస్తే
ఊరకుక్కలు చూచి మొరక్కుండా వూరికే వుంటాయా?
ఊళ్ళకు దూరమైన శరణులు, ఊళ్ళ మధ్యలోకి వస్తే
తిట్టేవాండ్లు తిట్టకుండా వుంటారా అయ్యా?
దూషకుల పాలి ధూమకేతువులు మీ శరణులు
కూడల సంగమదేవా! - సమగ్ర వచన సంపుటం : 1వచనము సంఖ్య : 1405
వచనానుభావము: పై వచనము ధర్మగురు బసవేశ్వరుని ఒక సుప్రసిద్ధమైన వచనమై ఉన్నది. ఇందులో దూషకులపాలిట శరణులు ధూమకేతువులుగా చెప్పడం గమనించవచ్చు. _"ఊరిలోనికి క్రొత్త వాళ్ళు వస్తే ఊర కుక్క చూసి మొరగక ఊరికే వదుల్తుందా ? ఊర కుక్కలు తాను ఉన్నచోటే అంటే తన ఊరిలోనే ఎక్కువగా అరుస్తూ ఉంటాయి. వాటికి అది స్థాన బలమే కాని ధైర్య సాహసాలతో కాదు. ఊరకుక్కలున్న ఊర్లోకి ఎవరైనా కొత్తవారు కనిపించారంటే అంతే సంగతి ఊరూరా తెలిసేలా అరవడం మొదలు పెడతాయి. అవి వాటి ప్రకృతి నైజమే గాని వాటి ధైర్య సాహసాలు కావు.
"ఊరుకు వెలియైన శరణులు ఊరు మధ్యలో ఉంటే దూషకులు దూషించకుండా ఉంటారా అయ్యా ?"
ఊరుకు వెలియైన శరణుడు అంటే ; శరణుడు అందరిలాగా ఆలోచన చెయ్యడు, శరణుడు అందరిలాగా ఉండడు, శరణుడు గొర్రెల మందలో గొర్రెగా ఉండేవాడు కాదు. అజ్ఞానం అంధకారాలతో, మూఢనమ్మకాలతో, అనాచారాన్ని ఆచారంగా చూపెడు వారలతో, అన్యాయం, అక్రమాలు, అధర్మముతో, విసిగిపోయిన వారలతో కలిసి ఉండేవాడు కాదు శరణుడు. అటువంటి శరణులు అందరిలా ఉండడు. ఆయనకంటూ ఆలోచనా, వ్యక్తిత్వం, స్వభావం, అన్నీ అందరికంటే భిన్నంగా ఉంటాయి. అటువంటి శరణుడు ఊరి మధ్యలో ఉంటే దూషకులు శరణులను దూషించకుండా ఉండడం సాధ్యమా ? అస్సలు సాధ్యమే కాదు. ఎందుకంటే వారికి దూషణయే ఒక భూషణంగా భావిస్తారు కనుక.
"దూషకుల పాలిట ధూమకేతువులు మీ శరణులు కూడలసంగమదేవా !"
అజ్ఞాన అంధకారముతో కొట్టి మిట్టాడుతున్న దూషకులు, ఇతరులకు దూశించటంతోనే కాలం వెళ్ళిపోతుందని తెలుసుకోలేక పోవడం చేత, తమలో ఉన్న దైవత్వాన్ని మరియూ దివ్య మైన శక్తి, సామర్థ్యాలు, నైపుణ్యాలు, సేవా దృక్పథం, వినయ విధేయతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. దానిద్వారా వారికి తనకు తానుగానే అపకీర్తి రావడం, వారి అజ్ఞానం వారికే గోచరిస్తుంది. అటువంటి వారలకు శరణులు ధూమకేతువులుగా మారుతారని పై బసవేశ్వరుని వచనములోని భావార్థం.
బసవాది శరణుల వచనాలను అందరూ చదవాలి అందరిచే చదివించాలి తానూ ఆచరించాలి ఇతరులచే ఆచరించేట్టు చెయ్యాలి
*