Previous అవరసరం రేకన్న ఆనందయ్య Next

ఆదయ్య

మకుటం: సౌరాష్ట్ర సోమేశ్వరా
కాయకం: వ్యాపారం

*

ముత్యంలో కాంస్యంలా
అంచులోని పట్టునూలులా
బంగారంలోని రంగులా
చీరలోని నూలు పోగులా
నాలో భిన్నం లేక ఉన్నావు కదయ్యా
సౌరాష్ట్ర సోమేశ్వరా! /1478 [1]

కరస్థలంలో లింగం ఉండగా
ఈ హస్తమే కైలాసం, ఈ లింగమే దేవుడు (శివుడు)
ఇది కారణం, ఇక్కడే కైలాసం
ఇది కాకుండా వేరే వెండి కొండయే కైలాసం అని
అక్కడుండే రుద్రడే శివుడని
కైలాసానికె వెళ్ళాను వచ్చాను అన్న భ్రాంతి వద్దు వినండన్నా
కాయంలోని అనుగ్రహ లింగంలో శ్రద్ధ లేకుండాపోతే
ఇంకెక్కడి నమ్మకం అయ్యా
అక్కడిక్కడకు చిందరవందరై చెడిపోకు వినండన్నా
అంగంలోని లింగాంగ సంగాన్నీ తెలుసుకుని
లోపలబయట ఒక్కటిగా
శిఖి సంగంలో కర్పూరం మంటలా అయ్యేట్టు
సర్వాంగంలో లింగం సోకి
అంగభావం చెరిగి, లింగభావం తన్మయం అయ్యే
తద్గత సుఖం ఉపమాతితం అయ్యా
సౌరాష్ట్ర సోమేశ్వరా. - ఆదయ్య/1482 [1]

ఆదయ్య: ఇతడు ప్రస్తుతం సౌరాష్ట్ర ప్రాంతీయుడు. వ్యాపారార్థం పులిగెరెకు వచ్చి. జైనకన్య పద్మావతిని ప్రేమించి, పెళ్ళాడి, మామగారితో వాదనకు నిల్చి సౌరాష్ట్ర నుండి సోమేశ్వరుని పిలుచుకు వచ్చి పులిగెరె (నేటి లక్షేశ్వరం)లోని సురపొన్నె బసదలో స్థాపించాడని ఆదయ్య రగళె, సోమనాథ చారితె) మున్నుగు కావ్యాల నుండి తెలియవస్తోంది. కాలం క్రి.శ.1165.

రాయిలో బంగారం తాపడం చేస్తే
బంగారం రాయకి సేవకత్వం చేస్తుందా
ముత్యపుచిప్పలో మౌక్తికం ఒదిగితే
ముత్యం చిప్పకు కింకరమౌతుందా?
ధరలో సురతరు నడగితే, సురతరువు ధరకు కింకరమౌతుందా?
జనని ఉదరంలో ఘన శరణుడు ఒదిగితే
జనని జన్మజునికి కింకరత్వం చేస్తుందా
సౌరాష్ట్ర సోమేశ్వరా మీ శరణులు
స్వతంత్ర శీలురు అగ్రగణ్యులు. /1483 [1]

ఘటాన్ని చేసిన కుమ్మరి ఆ ఘటంలో ఉండనట్టు
పంటను నాటిన వాడు ఆ పంటలో ఉండనట్టు
రథాన్ని చేసిన రథికుడు తా నా రథంలో ఉండనట్టు
సర్వమునాడించే ఈశర్వుడు యంత్ర యంత్రిగా ఉన్నందువలన
సర్వమూ శివుడనే అజ్ఞానులను మెచ్చుతాడా
మా సౌరాష్ట్ర సోమేశ్వరుడు? /1491 [1]

"సౌరాష్ట్ర సోమేశ్వరా" అనే అంకితముద్రతో వచనాలనూ మరియు స్వరవచనాలనూ చేశాడు. 401 దాకా వచనాలు దొరికినవి. వీటిలో శరణ, ధర్మతత్వాల నిశిత వివేచన వ్యాపకంగా కనిపిస్తుంది. సాహిత్య సత్వం, తాత్వాక ప్రౌఢిమల రెంటి మేళవింపు చక్కగా కుదిరాయి. విశేషంగా ప్రచురితమైనాయి.

చౌషష్టి విద్యలను నేర్చితే మాత్రం ఏమిటి?
అష్టాషష్టి క్షేత్రాలను మెట్టితే మాత్రం ఏమిటి?
వదిలితే ఏమిటి? కడితే మాత్రం ఏమిటి?
తెలుసుకున్న ఆచారం తోడుకుని పోనంత వరకు
ఘనలింగం వెలుగు స్వయంగా శరణునికి కాక
సౌరాష్ట్ర సోమేశ్వరలింగ సుఖం అలవడదు. /1492 [1]

వేదాల వెనుక తిరుగాడకు, తిరుగాడకు
శాస్త్రాల వెనుక తిరుగకు, తిరుకగు
పురాణాల వెనుక పడకు, పడకు
ఆగమాల వెనుక వేలాడకు, వేలాడకు
సౌరాష్ట్ర సోమేశ్వరుని చెయిని పట్టి
శబ్దజాలానికి వేసరిల్లకు, వేసరిల్లకు./1511 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous అవరసరం రేకన్న ఆనందయ్య Next