అడపం అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ
|
|
మకుటం |
అప్పన్న ప్రియ చెన్నబసవన్న |
కాయకం:
|
తాంబూలపు పెట్టె మోసేవాడు. |
ఆశ అనేది ఉన్నాక రోషం వదలదు
కామం ఉన్నాక కలవరం వీడదు
కాయగుణం ఉన్నాక జీవన బుద్ధి విడదు
భావం ఉన్నాక కోరిక పోదు
నడక ఉన్నప్పుడు పలుకుట తప్పదు
ఇవన్ని ముందుండగా వెనుకను తెలుసుకున్నానన్న
సందేహులారా, మీరు వినండిరా
మా శరణులు వెనుకను ఎలా తెలుసుకున్నారంటే
ఆశను వదలారు, రోషాన్ని వీడారు
కాముని కాల్చారు, కలవరాన్ని మింగారు
కాయగుణాన్ని మాపారు, జీవన బుద్ధిని వీడారు
భావాన్ని బయలు కావించారు కోర్కెను అరగదీశారు
వెనుకను తెలుసుకుని, ముందు లింగమే గూడైన శరణులను
ఈ సందేహులెలా తెలుసుకుంటారు. అప్పన్న ప్రియ చెన్న బసవన్నా /1357
[1]
అడపం అప్పన్నగారి పుణ్యస్త్రీ లింగమ్మ: బసవన్నగారి ఆప్తవర్గంలోని అడపం అప్పన్న భార్య ఈమె. గురువు చెన్నమల్లేశుడు. కాలం క్రీ.శ. 1160. ఉన్నత అనుభావియైన లింగమ్మగారి 114 వచనాలు, 1 స్వరవచనం, 1 మంత్రగోప్యంలు లభించాయి. "అప్పన్న ప్రియ చెన్నబసవన్న" అన్నది అంకితముద్ర. వీటిలో తత్వబోధే ప్రధానాంశంగా వున్నందువల్ల "తత్వబోధెయ వచనగళు" అని హస్త ప్రతిలో దాఖలైనవి.
కళ్ళముందు మాణిక్యం ఉండి ఎందుకు చూడరయ్యా
వాకిలి ముందు పాల సంద్రం ఉండి గుంటలోని నీళ్ళకు పరిగెత్తినట్లు
కళ్ళముందు మహాశరణుడు ఉండి చీకటి అనడం ఎందుకు?
మరి వేరే లింగాన్ని వెతుకుతాను అనడం ఎందుకు?
ఆ మహా శరణుడు మా అప్పన్న ప్రియుడు చెన్నబసవన్నయే వుండగా? /1358 [1]
కైలాసం మర్త్యలోకం అని అంటారు
కైలాసం అంటే ఏమిటో
మర్త్యలోకం అంటే ఏమిటో
అక్కడ నడత అంతా ఒక్కటే
ఇక్కడ నడతా ఒక్కటే
అక్కడ పలుకూ ఒక్కటే, ఇక్కడి పలుకూ ఒక్కటే
చూడండయ్యా అంటారు
కైలాసం వారె దేవర్కులని అంటారు
మర్త్యలోకం వారే మహాగణాలని అంటారు
సురలోకంలో వేయి ఏళ్ళకుకాని తుదిలేదని అంటారు
నరలోకంలో చచ్చి, చచ్చి పుడుతుంటారు
దీనిని చూసి మా శరణులు
సురలోకాన్ని, నరలొకాన్ని తృణమని భావించి
భవాన్నిదాటి తమ పుట్టుకను ఎగిరి,
మహావెలుగును కూడి వెలుగులో బయలయ్యారయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా /1361 [1]
మనోచాంచల్యం, దాన్ని నిగ్రహించే విధానం, గురు-లింగ-జంగమ భక్తి, శరణుల నడనుడులు ఆచార విచార నిష్ఠ, డాంభిక భక్తుల విమర్శ, యోగవివేచన ఈమె వచనాల్లో విపులంగా చెప్పబడినాయి. భాష తాత్విక నిరూపణలో మార్మిక పద్ధతిలో వుండగా విమర్శా విడంబనాల సందర్భంలో నేరుగా, సూటిగా దేశీయ పరమళంతో విరాజిల్లుతుంది.
నరులను వేడను, సురలను పాడను
కాముని వలకు చిక్కను భ్రాంతికి లోనవను
ప్రణవ పంచాక్షరిని జపించాను
తనువును మరచి నిజముక్తురాలనయ్యా
అప్పన్న ప్రియ చెన్న బసవన్నా / 1365
[1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*