Previous నగెయమారి తందె (నవ్వుల మారి తండ్రి) మోళిగె (కర్రల) మారయ్య Next

ముక్తాయక్క

మకుటం అజగణ్ణ తండ్రి

తెలివిని దవడలో నుంచుకొని నములుతోంది మర్త్యలోకమంతా
తెలివిని దాచుకోడం తెలియక లోకం అంతా చెడింది
నేనెలా బతకగలనన్నా
చీకటి వెలుగును చూచే సందేహిని నేనొక్కతెను
నా కళ్ళు కట్టి అద్దం చూపింది కదా అజగణ్ణా నీయోగం! /1324 [1]

ముక్తాయక్క: ఈమె అనుభావికతకు సంబంధించి చాలా ఎత్తులోనున్న శరణి. ఈమె పుట్టిల్లు లక్కుండి (గదగ జిల్లా, కర్నాటక రాష్ట్రం) మెట్టినిల్లు మసళకల్లు. శరణుడు అజగన్న ఈమె అన్న మరియు గురువు కూడ. అజగన్న లింగైక్య సమయంలో దు:ఖితయైన ఈమెను అల్లమప్రభువు జ్ఞాననేత్రం తెరిపించడం ద్వారా సాంత్వనపరుస్తాడు. కాలం క్రీ.శ.1160.

పూవులో దాగిన పరిమళంలా
అర్కనిలో అణగిన అనలంలా
శశిలో దాగిన షోడశ కళలా
సడిలో అణిగిన వాయువులా
ఉరుములో అణగిన గాత్ర తేజంలా
ఉండాలయ్యా యొగం, నా అజగన్న తండ్రిలా! /1325

"అజగణ్ణ తండ్రి" అంకితంతో ఈమె వచనాలు 32 దొరుకుతున్నాయి. ఇవన్నీ అన్నయ్య మరణానికై విలపించిన గీతికల్లా వున్నాయి. అల్లమప్రభునితో జరిపిన ఆధ్యాత్మ సంవాదంలో రూపుదాల్చిన అనుభావ గీతాల్లానూ వున్నాయి. శూన్య సంపాదనలో ఈ సంవాద ఘట్టం బాగా ప్రసిద్ధి చెందింది.

చెడు మాటల నాడకూడదు
చెడు నడతల నడువకూడదు
పలికితే ఏమిటి? పలుక కుంటే ఏమిటి
పట్టిన వ్రతాన్ని విడవనప్పుడు, అదే మహాజ్ఞానాచరణం
అంటాను అజగన్న తండ్రి! /1329[1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous నగెయమారి తందె (నవ్వుల మారి తండ్రి) మోళిగె (కర్రల) మారయ్య Next