Previous ప్రసాది భోగణ్ణ నివృత్తి సంగయ్య Next

నులియ (నులకల) చందయ్య

మకుటం చందేశ్వర
కాయకం: గడ్డితెచ్చి నులకలు పేని అమ్మటం

కందజేసి, కుందజేసి, బంధించి కనబడినవారిని బ్రతిమలాడి తెచ్చి
జంగమానికి చేశామనే కష్టపక్వాన్నం లింగానికి నైవేద్యంకాదు
తనువు కరిగించి మనస్సు శ్రమించి వచ్చిన జంగముని అనువు గ్రహించి
ఎడంలేక సంశయంలేక జంగమలింగానికి
దాసోహం చేసేది కాయకం
గుమ్మడికాయ అడవి ఆకుకూరైనా
కాయకంతో వచ్చింది లింగార్పితం
చెన్నబసవన్న ప్రియ చెందేశ్వర లింగానికి నైవేద్యం చెల్లింది /1817 [1]

నులియ (నులకల) చందయ్య: గడ్డితెచ్చి నులకలు పేని అమ్మి వచ్చిన సోమ్ములో జంగమ దాసోహం నడిపే చందయ్య గారొక కాయకయోగి. బీజాపురం జిల్లాలోని శివణగి ఈయన జన్మస్థలం. శూన్య సంపాదనం మరియు పురాణకావ్యాల్లో ఈతని కాయకనిష్ఠను గురించిన కథ విపులంగా తెలుపబడింది. ఇష్టలింగం చేతనే పగ్గాలమ్మించే కాయకం చేయించాడితడు. హెండద (సారాయి) మారయ్య తన ఒకానొక వచనంలో ఇతణ్ణి గురించి ఇతని ఘనవ్యక్తిత్వాన్ని గురించీ చాలా నాటకీయంగా వివరించాడు. కల్యాణక్రాంతి తరువాత చెన్న బసవన్నకు జతగా ఉళువికి వస్తాడు. చెన్న బసవన్న ఐక్యమైన తరువాత అక్కనాగమ్మను ఎణ్ణెహోళె అనే చోటికి తీసుకువెళ్ళి రక్షణ కల్పిస్తాడు. ఆమె అక్కడే ఐక్యం కాగా తాను ’నొలెనూరు’ అనే చోట బయలు చేరుకోంటాడు. ఈచోట ఇప్పటికీ ఇతని సమాధి వుందని తెలియవస్తోంది.

కత్తి పట్టుకున్నవారందరూ నరకగలరా?
సాధన చేసే బాలురందరూ యుద్ధం చేయగలరా?
ఆశపడి పనిచేసేవారందరూ సద్భక్తులౌతారా?
అది చందేశ్వరలింగానికి కూడని పని /1818[1]

గురువైనా కాయకంచేతనే జీవన్ముక్తి
లింగమైనా కాయకంచేతనే రాతిగురుతు తొలగేది
జంగమమైనా కాయకం చేతనే వేషంయొక్క పాశం తెగేది
గురువైనా జంగమ సేవ చేయాలి
లింగమైనా జంగమ సేవ చేయాలి
జంగమమైనా జంగమ సేవ చేయాలి
చన్నబసవన్న ప్రియ చందెశ్వరలింగ జ్ఞానం ఇదే! /1820[1]

’చందేశ్వర’ అంకితముద్రతో ఇతని 48 వచనాలు దొరికాయి. అన్ని కాయక మౌల్యాన్ని ఎత్తిచూపేవే! గురులింగ జంగములన్నింటికీ, అందరికీ కాయకం తప్పనిసరి. భావశుద్ధితో చేసేదే నిజమైన కాయకం. "తోటకూరైనా కాయకం ద్వారా వచ్చింది మాత్రం లింగార్పితం కాగలదు." అన్న ఇతని మాటల వలన ఈయన కాయక స్ఫూర్తి స్పష్టమవుతోంది.

సత్యశుద్ధ కాయకం చేత వచ్చిన ద్రవ్యంలో
చిత్తం చలించకుండా ఉండాలి
నియమపరమైన కూలిలో నిత్య నియమంలో తప్పుండకూడదు
నియమమైన కూలిని వదిలి
హేమంపై ఆశతో కామించి ద్రవ్యాన్ని గ్రహిస్తే
తాను చేసే సేవ నష్టమయ్యా
నీ ఆశల వేషపాశానాకి నీవే వెళ్ళు
నాకు మన జంగముని ప్రసాదంలోనే
చందేశ్వరలింగానికి ప్రాణమయ్యా /1824 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous ప్రసాది భోగణ్ణ నివృత్తి సంగయ్య Next