| మకుటం | 
                    
                        ఉరిలింగపెద్ది విశ్వేశ్వరా
                     | 
                
                
                    | 
                        కాయకం:
                     | 
                    
                        విద్వాంసుడు, గురు - పీఠాధిపతి
                     | 
                
            
        
        *
        
            అమృతం అందరికీ అమృతంగానే వుంటుంది కానీ
            కొందరికి అమృతమూ, మరి కొందరికి విషము కాదు.
            ఎంతో అంతే,
            శ్రీ గురువు అందరికీ గురువై వుండాలయ్యా
            ఉరిలింగ పెద్దిప్రియ విశ్వేశ్వరా! /1543 [1]
            
            బ్రహ్మా, విష్ణువు మొదలైన దేవదానవ మానవులందరిని
            ఆశ వెంటాడి వేధిస్తుంది
            మహత్త్యమైన వ్రత నియమ గురుత్వ తత్వమున్న వాళ్ళని
            చెడిపి, పలుచన చేసి పరిహాసం చేస్తుంది
            ఈ సామర్థ్యం వున్న పురుషులను గాయపరచి, ఓడించి
            తాను గెలవగలిగిన సామర్థ్యం కలది ఈ ఆశ! ఇదేమిటో
            అని విచారిస్తే
            శివ సంబంధుడు ఆశకు ఆసక్తడైనప్పుడు
            శివుని ఆజ్ఞచే వేధిస్తుంది
            శివుని దయగనువారిని చేరజాలదయ్యా
            ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! - ఉరిలింగపెద్ది/1573 [1]
            
            ఉరిలింగ పెద్ది: మొదట దొంగగా వున్న ఈ పెద్దన ఉరిలింగ దేవుని శిష్యుడైన పిదప ఘన విద్వాంసుడూ, అనుభావి అయి ఉత్తమ వచనాలను రచించాడు. కాళమ్మ ఈతని భార్య. కాలం క్రి.శ.1160 ఉరిలింగదేవుని అనంతరం ఆ పీఠమెక్కిన పెద్దన్న జాతిరీత్యా అస్పృశ్యుడుగా తెలిసివస్తున్నది. అందుకే ఈ పీఠమెక్కడం ఒక విప్లవ ఘటనగానే పరిగణించాలి. అస్పృశ్య లింగాయత మఠాలు కర్ణాటకంలో అనేకం వుండి, వాటిని ఉరిలింగ పెద్ది మఠాలుగా పిలువడం జరుగుతొంది.
            
            
            లింగవంతుడు లింగం లేని వారిని ఆశిస్తే ఆతనికి లింగము లేడు
            లింగం లేని వాడు ఎవరికీ ప్రయొజనం లేదు
            ప్రయొజనం లేని వారితో ఎవరూ స్నేహం చేయరు ఎవరూ ఏమి ఇవ్వరు
            ఇది కారణం
            దురాశను వదిలి నిరాశావంతుడై
            లింగణ్ణి ఆశ్రయించినపుడు ప్రసాదం లభిస్తుంది
            ప్రసాదం వల్ల ఇహ పర సిద్ది
            ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా!  /1579 [1]
            
            లింగాన్ని తెలుసుకున్న లింగవంతుడు సర్వాంగ లింగమూర్తి
            అతని మాటే వేదం
            అతని నడతే శాస్త్ర పురాణ ఆగమ చరిత్రలు
            ఆ మహామహుని మాటలతో తర్కించకూడదు
            నడతలో నాస్తికత వెదికితే నరకం తప్పదయ్యా
            లింగణ్ణి తెలసుకున్న మహా మహునికి నమో నమో అంటాను
            ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! /1581 [1]
            
            ఉరిలింగపెద్ది విశ్వేశ్వరా అన్న మకుటంతో ఈయన రచించిన 366 వచనాలు లభ్యమయ్యాయి. అందులో గురుమహిమకు అగ్రస్థానం లభించింది. దానితోపాటు లింగ జంగమతత్వ విచారం, కులజాతి సమస్య నిరూపితమైయింది. వచనాల నడమన ప్రాసంగికంగ వాడుకొన్న సంస్కృత భాషొద్ధరణలు ఈయన పాండిత్య పాట వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
            
            
            సూర్యుడు లేకుండా పగలుంటుందా? అయ్యా
            దేపం లేకుండా వెలుగుంటుందా? అయ్యా
            పువ్వు లేకుండా పరిమళాన్ని తెలుసుకోగలమా? అయ్యా
            సకలం లేకుండా నిష్కలం చూడటం కుదరదు
            మహాగణ నిరాళ పరమశివుణ్ణి
            లింగం చూపించింది, ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! /1588 [1]
            
            చనుబాలసుధ త్రాగే శిశువు చక్కెరనడుగుతాడా?
            పరసవేది దొరికించుకొన్న పురుషుడు బంగారు రజనును కడుగ నిచ్ఛస్తాడా?
            దాసోహము చేసే భక్తుడు మొక్షాన్నాశిస్తాడా?
            ఈ ముగ్గురుకి మరే ఇచ్ఛా లేదు
            రుచియైన పదార్థాంలా, లింగ పదం సహజ సుఖవయ్యా
            ఉరిలింగ పెద్ది ప్రియ విశ్వేశ్వరా! /1590 [1]
        
     
    Reference:
    
        గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
        సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
        సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
    
    
        [1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
        ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
        G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
    
    
    *