మకుటం |
గుహేశ్వర |
కాయకం: |
అనుభవ మంటప అధ్యక్షుడు |
*
కల్యాణమను ప్రమిదలోన
భక్తి రసమను నూనెను పొసి
ఆచారమనె ఒత్తితో
బసవన్న అను జ్యోతి తాకించగా
పూని వెలుగు చుండెనయ్యా శివుని ప్రకాశం
ఆ వెలుగులో ఒప్పియుండిరయ్యా
అసంఖ్యాత భక్త గణములు
శివభక్తులున్న క్షేత్రమే అవిముక్త క్షేత్రమనెది అబద్ధమా?
గుహేశ్వర లింగమందు
నా పరమారాధ్యుని సంగని బసవన్నను గని
బ్రతికితిని కనుమా సిద్ధరామయ్యా. -అల్లమప్రభు/496 [1]
కుమ్మరి పురుగులా
ఒంటికి మన్నంటకుండ వున్నావుగా బసవన్నా
నిటిలోని తామర (పువ్వు)లా
తడిసి తడియనట్లు వున్నావుగా బసవన్నా
జలంలోని తామరలా
అంటి అంటనట్లు వున్నావుగదా బసవన్నా
గుహేశ్వరలింగం అనతి మీద
దేహాభిమాన మత్తులైన
ఐశ్వర్యాంధ కుల మతము
నేమి చేయ వస్తివయ్యా
సంగన బసవన్నా -అల్లమప్రభు/509 [1]
అల్లమ ప్రభువు: శరణొద్యమపు విప్లవ నేతలలో అల్లమ ప్రభునిది చాల పెద్ద పేరు. అనుభావం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పై మెట్టులో వున్న ఈయన జీవన సాధనలు గురించి అనేక కావ్యాలు వ్రాయబడి, అవి హరిహరుని సంప్రదాయం, చామరసు సంప్రదాయాలనే రెండు శాఖలుగా పెరిగాయి.
అల్లముడు పుట్టినది శివమొగ్గ జిల్లాలోని శికారపురం తాలూకాకు చెందిన "బళ్ళిగావి". తండ్రి నిరహంకారుడు, తల్లి సుజ్ఞాని. దేవస్థానంలో మద్దెల వాయించడం ఈతని వృత్తి. ఇతని ఈ కళాప్రావీణ్యానికి పరవశురాలైన కామలత అనే స్త్రీ ఇతణ్ణి వరిస్తుంది. హరిహరుడు (అనేక శరణుల జీవనచరిత్రలను గ్రంథస్థం చేసిన 14వ శతాబ్దపు తొలినాళ్ళ కన్నడ కవి), సతియొక్క అకాలిక మరణంతో ఇతని వైరాగ్య పథ జీవనం ఆరంభమైందంటే చామరసు ప్రకారం తన కళావైభవాన్ని మెచ్చి వచ్చిన మాయాదేవిని నిరాకరించి ఇతడు మాయా కోలాహలుడనిపించుకొంటాడు.
ఆజ్ఞానమనే ఉయ్యాలలో
జ్ఞానమనె శిశువును పడుకోబెట్టి
సకల వేదశాస్త్రములనే తాళ్లు కట్టి
పట్టి ఊపుతూ జోల పాడుతోంది
భ్రాంతి అనే తల్లి.
ఊయల విరిగి తాళ్లు తెగి
జోల పాట నిలువక పోతే
గుహేశ్వరుడనే లింగం కానలేము - అల్లమప్రభు/447 [1]
అమృతసాగరంలోనే వుండి ఆవును గురించిన చింత ఎందుకు?
మేరువు మధ్యదాగి బంగరు పోడిని కడిగే చింత ఎందుకు?
గురునితో చేరి తత్వవిద్యల చింత ఎందుకు?
ప్రసాదంలో వుండి ముక్తిని గురించి చింత ఎందుకు?
కరస్థలాన లింగమున్న తరువాత
ఇంక వేరే చింతలెందుకు చెప్పరా గుహేశ్వరా?/ 451 [1]
అనిమిష దేవుడు అల్లముని గురువు. ఈయన దర్శనంవల్ల అల్లముడు అనుభావిగా ఎదుగుతాడు. అనంతరం చరజంగముడై లోక సంచారం చెపడతాడు. గొగ్గయ్య, ముక్తాయక్క, సిద్ధరామ, గోరక్షుడాది అనేక సాధుకుల మనసులోని చీకటిని తొలగించి, సరియైన మార్గములయ్యేట్లు చేస్తాడు. బసవన్నగారి మహావిప్లవాన్ని చూడడానికి సిద్ధరాముని పిల్చుకొని కల్యాణానికి వస్తాడు. అక్కడి అనుభవ మంటపానికి అధ్యక్షడై ఆధ్యాత్మ చింతనకు మార్గ నిర్ధేశం చేస్తాడు. కల్యాణ నగరంలో క్రాంతి జరిగేందుకు కాస్త ముందుగానే శ్రీశైలం దిక్కుగా నడచి అక్కడి కదళిలో ఐక్యమౌతాడు.
తనువు బత్తలగా నుంటేనేమి శుచి కాకున్నంత వరకు
తల బొడైతేనేమి భావము బయలుకానంత వరకు
భస్మము పూసితే నేమి?
కరణాదుల గుణాల నొత్తి త్రొక్కి కాల్చనంత వరకు
ఇట్లాంటి ఆశల వేషపు భాషకు
గుహేశ్వరా నీవు సాక్షిగా ఛీకొడతాను. - అల్లమప్రభు/530 [1]
తల్లిదండ్రులు లేని కన్నా
నీకు నీవే పుట్టి పెరిగితివి కదా
నీ పరిణామమే నీకు ప్రాణతృప్తిగా ఉంది కదా!
భేదకులకు అభేద్యుడనై నిన్ను నీవే వెలుగుచున్నావు కదా!
నీ చరిత్ర నీకు సహజము గుహేశ్వరా - అల్లమప్రభు/536 [1]
"గుహేశ్వర" అంకితంలో వచనాలు, స్వరవచనాలు, సృష్టి వచనాలు, మంత్ర గోప్యంలను రచించాడు. ఇప్పటికి 1645 వచనాలు దొరికాయి. అధ్యాత్మికతన అనుభావం వాటి మూలధనం. అలాంటి వెన్నింటినో వెడగుమార్మిక శైలిలో వ్యక్తపరచడం విశేషం.
బంగారు మాయ అంటారు - బంగారు మాయకాదు
అంగన మాయ అంటారు - అంగన మాయకాదు
కనుముంగిట మట్టిమాయ అంటారు - మట్టిమాయ కాదు
మనసు ముంగిట ఆశే మాయ కనమా గుహేశ్వరా. - అల్లమప్రభు /464 [1]
రెండు కళ్లకు ఒకే చూపైనట్లు
దంపతులేక భావంతో నిలిచినపుడు
గుహేశ్వర లింగానికి నివేదనమైనది సంగన బసవన్న -అల్లమప్రభు/472 [1]
దేహంలో దేవాలయముండి
మరినేరే దేవళ మేలయ్యా
రెండింటిని చెప్పరాదయ్యా
గుహేశ్వరా నీవు రాయివైతే నేనేమౌతాను? - అల్లమప్రభు/541 [1]
మానులోని ఆకులూ పళ్లు
క్రమానుగుణంగా కనుపించినట్లుగా
హరునిలోపలి ప్రకృతి స్వభావాలు
హరుని భావేచ్ఛతో కానుపించు కొంటాయి
లీల యైతేను ఉమాపతి
లీల మానితే స్వయంభువు గుహేశ్వరా - అల్లమప్రభు/587
మర్త్యలోకములోని మానవులు
దేవళమందొక దేవుని చేయ
నేనబ్బుర పడితిని
నిత్యానికి నిత్యంగా అర్చన పూజనలు చేయించి
వైభోగము నెరపే వారిని చూచి నేనబ్బుర పడితిని
గుహేశ్వరా
మీ శరణులు, గతమున లింగమునుంచి పోయారు - అల్లమప్రభు/588 [1]
మాటన్నది జ్యోతిర్లింగం స్వరమనేది పరతత్వం
తాళవాద్య సంపుటమన్నది నాదబిందు కళాతీతం
గుహేశ్వరుని శరణులు
మాట్లాడి మైలచెందరు వినరా ఉన్మాదీ. - అల్లమప్రభు/592 [1]
స్నానించి దేవుని పూజింతుననే సందేహి మానవా వినరోరీ
స్నానించదా చేప? స్నానించదా మొసలి?
తాను స్నానించి తనమనసు శుచికానంత వరకు
ఈ మాయల మాటలు మెచ్చునా మా గుహేశ్వరుడు. - అల్లమప్రభు/593 [1]
మబ్బుల మాటున మెరపులా
బయలు మాటున ఎండమావిలా
శబ్దము మాటున నిశ్యబ్దములా
కన్నుల మాటున వెలుగులా
గుహేశ్వరా మీ తీరు. - అల్లమప్రభు/596 [1]
వేదాలనేవి బ్రహ్మాయ్య బూటకం
శాస్త్రములనేవి సరస్వతమ్మ పితలాటకం
ఆగమాలనేవి ఋషుల ఉన్మాదం
పరాణాలనేవి పూర్వుల నాటకం
ఈలాగున వీటిని తెలిసిన వారిని వీధికిలాగి
నిజంగా నిందించేవాడే గుహేశ్వరునిలో
అచ్చంగా లింగైక్యుడు. - అల్లమప్రభు/607 [1]
వేదం ప్రమాణం కాదు శాస్త్రమూ ప్రమాణం కాదు
శబ్దం ప్రమాణం కాదు చూడండహో లింగానికి
అంగసంగం నడుమ నుండి, దాచుకొని వాడకొన్నాడు
గుహేశ్వరా మీ శరణుడు - అల్లమప్రభు/608 [1]
వేదమనేది చదువుల మాట
శాస్త్రమనేది సంతల సుద్దులు
పురాణములనేది దోంగల గోష్ఠి
తర్కమనేది టగరుల పోరు
భక్తి అనేది, కోరి, అనుభవించే లాభం
గుహేశ్వరడు అందని ఘనము. -అల్లమప్రభు/ 609 [1]
వేదాలు అందుకోవడం తెలియక చెడ్డాయి
శాస్త్రాలు సాధించుటెరుగక చెడ్డాయి
పురాణాలు పూరించుట తెలియక చెడ్డాయి
పెద్దలు తమ్ముతా మెరుగక చెడ్డారు
తమ బుద్ధి, తమనే తిన్నది
మిమ్మేక్కడ తెలిసేరురా గుహేశ్వరా. - అల్లమప్రభు/610 [1]
సతిని గాంచి వ్రతియైనాడు బసవన్న
వ్రతియై బ్రహ్మచారియైనాడు బసవన్న
బ్రహ్మచారియై భవరహితుడైనాడు బసవన్న
గుహేశ్వరా మిలో బాలబ్రహ్మచారియైనది బసవన్న ఒక్కడే. -అల్లమప్రభు/618 [1]
చుట్టి చుట్టి వస్తే లేదు లక్ఞగంగల్లో మునిగిన లేదు
కొట్టకొనల మేరుగిరినెక్కి కెకలిడిన లేదు
నిత్య నేమముతో తనువు తాకినా లేదు
నిత్యానికి నిత్యం తలచే మనసును
ఆనాటి కానాటికి అట్టిట్టు తిరిగే మనసును
చిత్తంలో నిలుపగల్గితే నిర్మలమైన వెలుగు గుహేశ్వరలింగము - అల్లమప్రభు/625 [1]
పాల నేమము పట్టినవాడు పిల్లియై పుడతాడు
శనగల నేమము పట్టినవాడు గుర్రమై పుడతాడు
ఆర్ఘ్యపు నేమము పట్టినవాడు కప్పయై పుడతాడు
పూల నేమము పట్టినవాడు తుమ్మెదై పుడతాడు
ఇది షడు స్థలమునకు వెలుపలనే సుమా
నిజభక్తి లేనివారిని చూసియు మెచ్చడు గుహేశ్వరుడు - అల్లమప్రభు/635 [1]
Reference:
గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం:డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద
సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర
సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.
[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu",
ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation:
G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.
*