Previous ఏలేశ్వర కేతయ్య గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ Next

గజేశ మసణయ్య

మకుటం మహాలింగ గజేశ్వర

*

కౌగిలిలో స్పర్శసుఖాన్ని నిరాకరించే మనసుకన్నా
గొడ్రాలుగా వుండటం ఎంతో మేలు చూడమ్మా
అతని కంటి చూపు మనస్సు సహింపదు
సిద్ధమై వేచివడలిన విధానం చూడమ్మా
ఈకలు పెరికిన హంసలా అయ్యానయ్యా
మహాలింగ గజేశ్వరుడున్న తావున! /1644 [1]

గజేశ మసణయ్య: అక్కలకొటె సంస్థానికి చెందిన కర్జగి, గ్రామానిక చెందినవాడు. శరణసతి-లింగపతి భావాల శ్రేష్ఠ వచనకారుడు. కల్యాణంలో శరణుల జతలో వుండి అనుబావగోష్ఠిలో నున్న ఇతను చివరి రోజుల్లో గులబర్గా జిల్లా ఆళంద తాలూకాలోని మనవళ్ళి అనే గ్రాంమంలో వుండి అక్కడనై ఐక్యమైనట్లు తెలుస్తున్నది. నిదర్శనంగా ఆతని పేరనే అక్కడ వెలసిన దేవాలయం వుంది. కరజిగి గజేశ్వరుడీతని ఇష్టదైవం. దాన్నే తన వచనాలకు మకుటంగా వాడుకొన్నాడు. మసణమ్మ ఈయన పెళ్ళాము. కాలం క్రి.శ.1160 మహాలింగ గజేశ్వర అంకితముద్రతో 70 వచనాలు దొరికాయి. అన్నీ కూడా సతి-పతి భావనోత్కటతను ప్రకటిస్తాయి. సరళమైన భాష, మధుర భావలహరి, కావ్యాత్మకశైలితోనూ వచనాలు చాలాబాగా ఆకర్షించి ఆకట్టుకొంటాయి.

ఉదరంలోన తాకిన ప్రియునిమాట అధరంలో వేసరపడుతుందని
అధరాల్ని మూసి వుంచిందమ్మా
కళ్ళు కొనలు దిగులు పడ్డాయని కనుకొలకులు వేసరపడతాయని
కళ్ళు మూసి వుంచిందమ్మా
పరిమళం వేసరపడుతుందని
భ్రమరాన్ని దవ్వుగా తరిమిందమ్మా
మనస్సు చంచలం కారాదని
సూర్యున్ని కాపలా వుంచిందమ్మా
నేడు మన మహాలింగ గజేశ్వరుని కలిసే తొందరలో. /1648 [1]

నా కంటి కొస ఎరుపెక్కిందమ్మా
నా చేతులు ముడుచుకొన్నా యమ్మా
వేసుకున్న పగడాల దండ భారమైందమ్మా
ముక్తాఫల హారం వల్ల నేను క్రుంగి పోతున్నానమ్మా
ఈ నా మహాలింగ గజేశ్వరుడు
బహిరంగంలో వద్దని అంతరంగంలో కూడెను చూడవే అమ్మా! /1649 [1]

ఒసే తల్లి చూడమ్మా
చీకటిలో కలత చెందే జక్కువ పక్షుల్లా కుములుతున్నాను చూడమ్మా
చలికాలపు కోకిల లాగా మూగనైనాను చూడమ్మా
మహా లింగ గజేశ్వరుని
అనుభావ సంబంధీకుల రాక నాకు
ప్రాణం రాక చూడమ్మా! /1650 [1]

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previous ఏలేశ్వర కేతయ్య గజేశ మసణయ్యగారి పుణ్యస్త్రీ మసణమ్మ Next